ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే పుష్కర్‌సింగ్ ధామీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ తొలి భేటీలో ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు.ఇది అమలైతే ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుందని ధామీ చెప్పారు.
బహుశా ఇప్పటికే గోవాలో యూసీసీ అమల్లో ఉందని పేర్కొన్నారు.తద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికీ పెండ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ఒకే చట్టం వర్తింపచేయవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అయితే పుష్కర్ సింగ్ ధామి నిర్ణయంపై అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ చేసింది.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేయాలన్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు ఐఏఎంసీ పేర్కొంది.ఒక దేశంలోని పౌరులందరూ ‘లౌకిక’ విషయాలలో ఒకే రకమైన చట్టాలకు కట్టుబడి వుండేలా చూడటం వల్ల ముస్లింలు, క్రైస్తవులు ‘‘హిందూ ఆధిపత్య’’ ప్రభుత్వంచే నిర్మూలించబడుతారని ఐఏఎంసీ ఆరోపించింది.
హిందూ వివాహ చట్టం, భారతీయ క్రైస్తవ వివాహాల చట్టం, పార్సీలు, ముస్లిం వివాహాలు వ్యక్తిగత మత విశ్వాసాలు, మత గ్రంథాలపై ఆధారపడి వున్నాయని తెలిపింది.యూసీసీ అమలు ద్వారా భారతదేశంలో ఇప్పటికే అట్టడుగున వున్న ముస్లింలు, క్రైస్తవుల ప్రగతికి ఆటంకం కలిగిస్తుందని ఐఏఎంసీ వెల్లడించింది.
ఇదే సమయంలో కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదాన్ని గుర్తు చేసింది.దేశంలోని ప్రతి పాఠశాలకు, వారి పాఠశాల యూనిఫాంను నిర్ణయించే హక్కు వుందని కోర్టు తీర్పునిచ్చిందని ఐఏఎంసీ పేర్కొంది.
ఈ సందర్భంగా ఐఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.భారతదేశాన్ని హిందూ మెజారిటీ రాష్ట్రంగా మార్చే దిశలో యూసీసీ మరో అడుగుగా వ్యాఖ్యానించారు.ఇక్కడ మైనారిటీలు రెండవ తరగతి పౌరసత్వానికి దిగజారారు అని అన్నారు.ముస్లింలు, ఇతర మైనారిటీల మతపరమైన ఆచారాలను సమర్థవంతంగా తొలగించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రషీద్ ఆరోపించారు.
ఇందుకు యూసీసీ అనేది ఒక సాధనంగా ఆయన అభివర్ణించారు.
.