ప్రపంచం ఒక కుగ్రామం అయిన తర్వాత ప్రస్తుత కాలంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు.నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు అక్కడే స్థిరపడుతున్నారు.
అయితే పలు దేశాల్లో అంతర్యుద్ధాలు, దురాక్రమణలు చోటు చేసుకుంటుండటంతో వీరి తరలింపు ప్రక్రియ భారత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.ఇటీవలి ఆఫ్ఘన్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా భారతీయుల తరలింపు కోసం కేంద్రం ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి కమిటీ కేంద్రానికి పలు సూచనలు చేసింది.వివిధ దేశాల్లో వున్న భారతీయుల డేటా బేస్‌ను రూపొందించాలని సిఫారసు చేసింది.
విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.భారతీయ పౌరులు ప్రపంచం నలుమూలలా విస్తరించి వున్నందున సంక్షోభ పరిస్ధితుల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా వుంటుందని అభిప్రాయపడింది.
ఇటీవలి ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్ సంక్షోభాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో వున్నాయని కమిటీ అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలోనే విదేశాలలో వున్న భారతీయ పౌరుల డేటా బేస్‌ను తయారు చేసి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కమిటీ కోరింది.
అత్యవసర పరిస్ధితుల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ)ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్యానెల్ సూచించింది.అలాగే దీనిని ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ రాయబార కార్యాలయాల్లో అందుబాటులో వుంచాలని సిఫార్సు చేసింది.

ఇకపోతే.విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.1,33,83,718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు.గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 6 లక్షల మందికిపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు తెలియజేసింది.దీని ప్రకారం 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని విడిచిపెట్టారు.
—







