ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది.అలానే ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా దినదినం పెరుగుతూ పోతుంది.
ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.ఇక ఇదే తరుణంలో బ్యాంకులన్నీ అరచేతిలోకి వచ్చేశాయి.
ఆర్థిక లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగున్నాయి.ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
పోలీసులు ఎన్ని రకాలు గా వీరి నేరాలకు కళ్లెం వేసినా కానీ వీరు రోజుకో పద్ధతిలో వస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు.ఇప్పుడు కూడా ఒక కొత్త రూట్లో వీరు ఎంట్రీ ఇచ్చారు.
వీరు ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారనే విషయం గురించి తెలుసుకుంటే.
కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా దేశంలో ప్రస్తుతం సంచలనం క్రియేట్ చేస్తోంది.చిన్న సినిమాగా విడుదలై రూ.100 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధమైంది.ఈ విషయంలో సినిమా దర్శక నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు.కానీ ఇదే విషయంతో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సామాన్యులను మోసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో అందరి అటెన్షన్ ఈ సినిమాపై పడింది.ఎలాగైనా సరే ఈ సినిమాను వీక్షించాలని చాలా మంది నిర్ణయించుకుంటున్నారు.
ఈ సినిమాను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేస్తే సరిపోతుందని సైబర్ నేరగాళ్లు ఓ మెస్సేజును వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు.ఎవరైనా సరే తెలియక ఈ లింక్ ను కనుక క్లిక్ చేస్తే వారి స్మార్ట్ ఫోన్లలోకి ఓ భయంకరమైన మాల్వేర్ ప్రవేశిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ఈ మాల్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు మీ ఆర్థిక లావాదేవీలను కంట్రోల్ చేస్తారని, మీరు మీ ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ కోల్పోతారని వారు చెబుతున్నారు.







