రాజకీయ ప్రత్యర్థులు అంతా ఏకమవుతున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలంటే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక పార్టీలన్నిటి తో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధ్యమవుతుందనే విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించాయి.అందుకే ఉమ్మడిగా వైసీపీపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన, టిడిపి, వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోరాటాలు చేస్తున్నాయి.
అయితే విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని, దీని వల్ల మళ్లీ వైసీపీకే అధికారం దక్కుతుందనే విషయాన్ని దాదాపు అన్ని పార్టీలు గుర్తించాయి.ఇదే విషయాన్ని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
వైసిపి వ్యతిరేక పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.దీంతో టిడిపి , బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయం అనే విషయం స్పష్టం అయ్యింది.
దీంతో వైసిపి విజయావకాశాలపై ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది.అయితే ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఒంటరిగానే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే విషయం ఇప్పటికే జగన్ ప్రస్తావించారు.తాను ఏపీ ముఖ్యమంత్రి గా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఇవే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని , గతం కంటే మెరుగైన ఫలితాలు ఈసారి వస్తాయని నమ్మకంతో జగన్ ఉన్నారు.2019 ఎన్నికలకు ముందు జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించారు.ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను కోరారు.అనుకున్నట్లుగానే 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించారు.అయితే ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
దీనికి కారణం ఏపీలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నా, పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోకపోవడం వంటివి వైసిపికి ఇబ్బందికరం గా మారే అవకాశం లేకపోలేదు.అయితే దీనివల్ల పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని జగన్ అభిప్రాయపడుతున్నారు.దీనికి 2018 లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలనే జగన్ లెక్కలోకి తీసుకుంటున్నారు.
అక్కడ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లినా, టిఆర్ఎస్ మళ్లీ గెలిచింది.దీనికి కారణం టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే అప్పటివరకు అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే భయం ప్రజల్లో ఉండటంతోనే రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
ఇక్కడ అదే జరుగుతుందని నమ్మకంతో జగన్ ఉన్నారు.అసలు పవన్ ప్రభావం పెద్దగా ఎన్నికల్లో ఉండదని, బిజెపి పరిస్థితి అంతంత మాత్రమేనని, అటువంటి పార్టీలను కలుపుకుని టిడిపి తమకు గట్టిపోటీ ఇచ్చినా అంతిమ విజయం తమదేననే ధీమా లో జగన్ ఉన్నారట.