కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అంటూ వస్తున్న ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఖండించారు.నెల్లూరు నగరంలోని జిల్లాకేంద్ర శక్తి ప్రముఖుల సమావేశం కు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపిలోకి ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ వస్తున్న వదంతులను తోసిపుచ్చారు.
ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధత కలిగిన కార్యకర్తలే ఆధారంగా భారతీయ జనతా పార్టీ అడుగులు ముందుకు వేస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వారు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదంటూ స్పష్టం చేశారు.కుటుంబ రాజకీయాలను దూరం చేయాలన్న ఆలోచనతో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కుటుంబ రాజకీయాలను నడిపేవారిని ఏ నాటికి కలుపుకోవడం జరగదన్నారు.
స్వార్థ రాజకీయాలను, గనుల తవ్వకాల వ్యాపారం చేసే నేతలకు భారతీయ జనతా పార్టీ స్థానం కల్పించదని,వారు సృష్టించే వదంతులను కూడా పట్టించుకోదన్నారు.ఎంపీ అవినాష్ రెడ్డి ని బిజెపి లోకి చేర్చుకోవడం అనే అంశం ఎప్పుడు జరగదని, కార్యకర్తలు ఈ అంశంపై ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.