టిఆర్ఎస్ లో నిన్న జరిగిన పరిణామాలు పెను సంచలనమే సృష్టించాయి.పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉండడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఆగమేఘాల మీద విచారణ పూర్తి కావడం, ఆయన తప్పు చేశారనే విషయం ప్రజల్లోకి టిఆర్ఎస్ బలంగా తీసుకు వెళ్లడం, దీనికి సంబంధించిన మీడియా కధనాలు పెద్ద ఎత్తున రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయి.
అంతేకాదు ఈటెల నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ను కూడా ఇప్పుడు కెసిఆర్ తీసుకోవడం ఇలా అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.ఇక ఆయన రాజీనామా కోరడం ఒక్కటే మిగిలి ఉంది.
మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు, దానిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందినట్లుగా కలెక్టర్ విచారణలో తేలడం, టిఆర్ఎస్ సొంత ఛానల్ అయిన టీ న్యూస్ తో పాటు, మరికొన్ని ఛానళ్లలో ఈటెల రాజేందర్ పై భూకబ్జా కథనాలు వస్తుండటం వంటివి అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇక ఈటెల రాజేందర్ తరువాత తెలంగాణ మంత్రి, కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావు టార్గెట్ కాబోతున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకున్నాయి.
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వ్యక్తుల్లో హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముఖ్యులు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ వీరిద్దరికి అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చారు.
హరీష్ రావు కు ఇరిగేషన్, ఈటెల రాజేందర్ కు ఆర్థికశాఖ అప్పగించారు.కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు నేతల ప్రాధాన్యం బాగా తగ్గించేశారు.
మొదట జరిగిన మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికీ పదవులు దక్కలేదు.దీంతో కెసిఆర్ పై తీవ్ర ఒత్తిడి పెరగడం, తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెడుతున్నారనే అభిప్రాయం పార్టీలో నెలకొనడం, ఇలా అనేక కారణాలతో వారికి ఆలస్యంగా మంత్రి పదవులు దక్కాయి.

అయితే హరీష్ రావుకు ఆర్థిక శాఖ ఇచ్చి ఆయన జిల్లాల పర్యటనలు చేయకుండా కెసిఆర్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది.అలాగే గత ప్రభుత్వంలో హరీష్ రావు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారనే వాదన పెద్ద ఎత్తున జరగడం వెనుక కెసిఆర్, కేటీఆర్ ఉన్నారని, పార్టీలోనూ, ప్రజలలోనూ ప్రాధాన్యత పెరగకుండా వ్యూహం పన్నుతున్నారని, ఇప్పుడు ఈటెల రాజేందర్ తర్వాత పూర్తిగా హరీష్ రావు టార్గెట్ గా రాజకీయం జరగబోతుంది అనే ప్రచారాలు మొదలయ్యాయి.దీంతో టీఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.