తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ పేరున్న నాయకులందరినీ తమ దారిలోకి తెచ్చుకుని , రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది.ఇదంతా సాధ్యం కావాలంటే క్షేత్రస్థాయి నుంచి జనాల్లో పట్టు ఉన్న నాయకులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ, తన ప్రసంగాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వ్యక్తుల కోసం బిజెపి ఆరాటపడుతోంది.
ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో ఆ తరహా నాయకులు కొంతమంది ఉన్నా, మరి కొంతమందిని చేర్చుకోవాలి అని ఆ పార్టీ చూస్తోంది.అందుకే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని బీజేపీ లో చేర్చుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.
బిజెపిలో చేరితే ప్రాధాన్యం పెంచడంతోపాటు, కీలకమైన పదవిని అప్పగిస్తాము అంటూ ఆఫర్లు పెట్టినా, రేవంత్ నుంచి స్పందన కనిపించడం లేదట.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనే కీలకంగా ఉన్నారు.
రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలో సీనియర్ నాయకులు కుట్రలు పన్నుతున్నా, ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, రేవంత్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.అయితే గత కొంత కాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో కలతచెందిన రేవంత్ సరైన స్టెప్ తీసుకోకపోతే ముందు ముందు రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని, అప్పుడు కోలుకోలేని విధంగా దెబ్బ తినాల్సి వస్తుందని ఇలా ఎన్నో రకాలుగా ఆందోళనలో ఉన్నారు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోరు జరుగుతోంది.ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటుంది అనే అభిప్రాయం జనాల్లోకి వస్తుందని, క్రమక్రమంగా పార్టీ ఇమేజ్ పెరిగే విధంగా చేయవచ్చునని, అలా కాకుండా సాగర్ ఎన్నికలలో మళ్ళీ ఓటమి చెందితే, ఇక కాంగ్రెస్ లో ఉన్నా ఉపయోగం ఉండదని, అప్పుడు బిజెపిలో చేరాలా లేక మరేదైనా పార్టీలోకి వెళ్లాలా లేక సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి సత్తా చాటుకోవాలా అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.