ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండడం తప్ప, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేయలేకపోతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.చెప్పుకోవడానికి జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు ఖ్యాతి ఉన్నా, ఆ పార్టీలో పేరుమోసిన బడా నాయకులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడం లో ఆరితేరిన రాజకీయ ఉద్దండులు చాలా మందే ఉన్నపటికీ , ఆ పార్టీని అధికారంలోకి నడిపించగల నాయకులు మాత్రం కనిపించడం లేదు.
ఎప్పుడూ గ్రూపు రాజకీయాలు, సొంత పార్టీ నాయకుల పైన విమర్శలు చేసుకుంటూ , సొంత పార్టీ నాయకుల ఎదుగుదలను అడ్డుకోవడం తోనే కాంగ్రెస్ నాయకులకు సమయం సరిపోతుంది తప్ప, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఆలోచన ఉన్న నాయకులు కేవలం అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో తిరుగుతూ, తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో పరపతి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
రేవంత్ పాదయాత్ర ద్వారా అటు పార్టీకి, ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుందని భావించినా, కాంగ్రెస్ కే ఎక్కువ లాభం.
కానీ అవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు రేవంత్ కి పోటీగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాదయాత్ర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఈ తరహ యాత్రలు చేపట్టే ఆలోచనతో ఉన్నారు.
దీంతో కాంగ్రెస్ లో ఉన్న ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా బిజెపి బలం పెంచుకోగలిగింది అంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ బలహీనం అవ్వడం , ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చాయి .2014 నుంచి చూసుకుంటే , కాంగ్రెస్ ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆ పార్టీ నాయకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.కాంగ్రెస్ తెలంగాణలో గెలిచినా, గెలవకపోయినా ఫర్వాలేదు.
తమ పంతాలు, పట్టింపులు ఇలాగే ఉంటాయి అన్నట్టుగా ఆ పార్టీలు నాయకుల వ్యవహార శైలి ఉండడం వంటి కారణాలతో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అసలు ఎప్పటికైనా బలం పుంజుకుంటుందా అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి.