ప్రపంచానికే పెద్దన్న దేశంగా వ్యవహరిస్తున్న అమెరికా అన్ని రంగాలలో తామే ముందుండాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.అన్ని రంగాలలో అగ్ర రాజ్యంగా ఉన్న తాము ఇందులో కూడా ఎందుకు అగ్ర స్థానంలో ఉండకూడదు అనుకుందో ఏమో కానీ ప్రపంచ పర్యావరణానికి ముప్పుగా భావిస్తున్న ప్లాస్టిక్ విషయంలో సైతం అగ్ర స్థానంలోనే నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా వాడినంత ప్లాస్టిక్ ఏ దేశం కూడా వాడటంలేదట.దాంతో అమెరికా ఇందులో కూడా అగ్రస్థానమే అంటూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు పర్యావరణవేత్తలు.
ప్లాస్టిక్ వ్యర్ధాలను కట్టడి చేయడంలో అమెరికా ఘోరమైన వైఫల్యం చెందిందని ప్రపంచ దేశాలు అన్నీ ప్లాస్టిక్ భూతంపై యుద్ధం చేస్తుంటే అమెరికా మాత్రం ప్లాస్టిక్ ను పెంచి పోషిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధకులు ఆరోపిస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా ప్రతీ ఏడాది సుమారు 4.63 కోట్ల ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటకు వస్తున్నాయని, వీటిని సరైనా విధంగా రిసైకిల్ చేయడం లేదని ఈ కారణంగా దాదాపు 12 లక్షల నుంచీ 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రంలో, భూమిలో కలిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారణంగా భూమిపై, సముద్రంలో ఉంటున్న జీవులకు తీవ్ర హాని జరుగుతోందని పరిశోధకులు తెలిపారు.
అంతేకాదు ఈ చెత్త ఎంత మొత్తంలో ఉంది అనడానికి వారు ఓ ఉదాహరణ కూడా తెలిపారు.అమెరికాలో ఓ సంవత్సర కాలంలో వచ్చే ఈ వ్యర్ధాలను అమెరికా శ్వేత సౌధం అంతటి స్థానంలో కుప్పగా పోస్తే 381 మీటర్ల కంటే కూడా ఎత్తుగా ఉంటుందని అన్నారు.
ఈ చెత్త మొత్తంలో అత్యధికంగా ఉండేది ప్లాస్టిక్ బాటిల్స్, ఆహార పదార్ధాలకు, చాక్లెట్స్ కు చుట్టే కవర్స్, అలాగే సరుకుల కోసం స్టోర్ నుంచీ తెచ్చుకునే ప్లాస్టిక్ సంచులేనని అన్నారు.ఇవన్నీ అధిక భాగం సముద్రాలలోనే కలుస్తున్నాయని తెలిపారు.