కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.డొమెస్టిక్ సర్వీసులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు అనుమానితులను ఐసోలేషన్‌కు పంపుతోంది.
దీనితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా క్వారంటైన్‌కు పంపేలా చర్యలు చేపట్టింది.
అయితే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని సిబ్బంది ప్రవర్తన వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఎన్ఆర్ఐలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కరోనా నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వారం రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాలి.అయితే ఇప్పుడు దాని నుంచి మినహాయింపు పొంది నేరుగా ఇంటికి వెళ్లే అవకాశాన్ని కేంద్రం కల్పించింది .ఇందుకోసం ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.ఈ పోర్టల్ ద్వారా విదేశీ ప్రయాణీకులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను పూర్తి చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అయితే శంషాబాద్ విమానాశ్రయంలోని అధికారులు ఎయిర్ సువిధకు సంబంధించిన నిబంధనలను పాటించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలలో క్యూలో నిలబడే ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చింది.తద్వారా ప్రయాణికులు ఎయిర్ సువిధ ఫారమ్ నింపి తప్పనిసరి సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోరవచ్చు.
ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒమన్ నివాసి నందిమల్ల వీణాకుమారి మస్కట్‌లో జరిగిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో కోవిడ్ నెగిటివ్ వచ్చింది.
అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న వీణా కుమారి ఎయిర్ సువిధ ప్రకారం అన్ని రకాల ఫార్మాలిటీలను పూర్తి చేశారు.అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు.ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్‌ను నిరాకరించడంతో ఆమె షాకయ్యారు.అవసరమైన అన్ని పత్రాలు, భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ అధికారుల తీరు వల్ల వీణాకుమారి హోటల్‌లో పెయిడ్ క్వారంటైన్ కోసం రూ.8,000 చెల్లించాల్సి వచ్చింది.
మరో ఘటనలో హైదరాబాద్‌లోని టోలీ చౌకీకి చెందిన గజాలా.
సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉంటున్నారు.ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఆమె హైదరాబాద్‌కు బయల్దేరింది.
ఆ సమయంలో తనతో పాటు అన్ని రకాల మెడికల్ రిపోర్టులను తీసుకెళ్లింది.ఎయిర్‌పోర్టులో తనకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరింది.
కానీ అధికారులు మాత్రం హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అన్నారు.కానీ సుదీర్ఘ వాదన తర్వాత కానీ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
కరోనా నేపథ్యంలో భారత్ కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడంతో స్వదేశానికి వచ్చే ఎన్ఆర్ఐల సంఖ్య పెరుగుతోంది.ఈ క్రమంలో ఆన్‌లైన్ సెల్ఫ్ డిక్లరేషన్, క్వారంటైన్ మినహాయింపు పోర్టల్‌లు వారికి కొన్ని వెసులుబాటులు కలిపిస్తున్నాయి.
గర్బిణీ, కుటుంబంలో ఎవరైనా మరణించినా, తీవ్రమైన అనారోగ్యం, 10 సంవత్సరాల లోపు చిన్నారులు ఆర్టీ పీసీఆర్ పరీక్షల ద్వారా కోవిడ్ నెగిటివ్ వస్తే వారికి ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు.