వివిధ దేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన భారతీయులు ప్రస్తుతం ఆయా దేశాల్లో వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.ఇదే సమయంలో ఉన్నత పదవులను సైతం అధిరోహిస్తున్నారు.
తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన లాయర్‌కి అరుదైన గౌరవం దక్కింది.సింగపూర్ లా అకాడమీ అధిపతిగా భారత సంతతికి చెందిన రామ తివారీ నియమితులయ్యారు.
ప్రస్తుతం సింగపూర్ లా అకాడమీ (ఎస్ఏఎల్) సీఈవోగా ఉన్న సెరెన్ రిటైర్ అవుతుండటంతో ఆయన స్థానంలో రామ తివారీని నియమిస్తూ సింగపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అకాడమీ చీఫ్‌గా తివారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న బాధ్యతలు స్వీకరించనున్నారు.లండన్‌లోని క్వీన్‌మేరీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించిన తివారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ ఎంఎస్సీ పూర్తి చేశారు.1999లో సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేరిన తివారీ ఆ తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్‌లో చేరాడు.
ఐటీ, మేధో సంపత్తి సమస్యలపై అనుభవాన్ని గడించారు.ఓ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా, యూఎస్ టెక్నాలజీ కంపెనీకి గ్లోబల్ సేల్స్ లీడ్‌గానూ ఆయన పనిచేసిన అనుభవం వుంది.రామ తివారీ నియామకం పట్ల సింగపూర్‌లో భారత సంతతి ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా భారత సంతతి జ్యుడీషియల్ కమిషనర్, మేధో సంపత్తి నిపుణుడు దేదార్ సింగ్ గిల్ నియమితులైన సంగతి తెలిసిందే.
గిల్ చేత అధ్యక్షుడు హలీమా యాకోబ్ ఈ నెల ప్రారంభంలో ప్రమాణస్వీకారం చేయించారు.