ఈ సారి ఇండో అమెరికన్లు నాన్నను రక్షిస్తారు: జూనియర్ ట్రంప్ ధీమా

వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి భారతీయ అమెరికన్లు తన తండ్రికి మద్ధతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్.

అధ్యక్షుని మద్ధతుదారు, ట్రంప్ విక్టరీ ఫైనాన్స్ కమిటీ కో ఛైర్ అల్ మాసన్ రాసిన ఒక వ్యాసాన్ని ఉటంకిస్తూ జూనియర్ ట్వీట్ చేశారు.

దేశంలోని కీలక రాష్ట్రాల్లో 50 శాతం మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ట్రంప్‌కు అండగా నిలబడతారని జూనియర్ ధీమా వ్యక్తం చేశారు.ట్రంప్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ట్రంప్ జూనియర్.2016లో భారతీయ అమెరికన్ సమాజం మద్ధతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు.గత మూడున్నర సంవత్సరాలుగా ఆయన భారతీయులతో సన్నిహితంగా మెలుగుతున్నారు.

నవంబర్ 3, 2020న అమెరికా అంతటా ఉన్న భారతీయ అమెరికన్ సమాజాల నుంచి ముఖ్యంగా ఫ్లోరిడా, వర్జీనియా, మిచిగాన్, పెన్సిల్వేనియాతో సహా కీలక రాష్ట్రాల్లో ట్రంప్ మళ్లీ గెలవాలని భావిస్తున్నారని మాసన్ తన వ్యాసంలో వ్యాఖ్యానించారు.డెమొక్రాట్లకు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న 50 శాతం భారతీయ అమెరికన్ ఓటర్లు తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతారని మాసన్ వ్యాఖ్యానించారు.

ఈ సామూహిక ఫిరాయింపు కారణంగా కీలక రాష్ట్రాల్లో పదివేల మంది కొత్త ఓటర్లు ట్రంప్‌కు చేకూరుతారని, తద్వారా ఆయన గెలుపు సునాయాసం అవుతుందని మాసన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

ట్రంప్ తిరిగి ఎన్నికయ్యేందుకు గాను భారతీయ అమెరికన్ నాయకులు, ట్రంప్ మద్ధతుదారులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు.సెప్టెంబర్‌లో అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి హ్యూస్టన్‌లో నిర్వహించిన ర్యాలీలో దాదాపు 50 వేల మంది భారతీయ అమెరికన్లు హాజరైన విషయాన్ని మాసన్ ప్రస్తావించారు.వరుసగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్రంప్ నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌తో తలపడనున్నారు.

అయితే ట్రంప్ కంటే బిడెన్ చాలా పాయింట్ల ముందు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు