అమెరికాలోని మిన్నియాపోలీస్‌లో శ్వేతజాతి పోలీసుల చేతిలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అగ్రరాజ్యాంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.అప్పటి వరకు శ్వేతజాతి ఆగడాలను పంటి బిగువున భరించిన నల్లజాతీయులు ఫ్లాయిడ్ హత్యతో రగిలిపోయారు.
తమకు న్యాయం చేయాలంటూ వారంతా రోడ్లమీదకు వస్తున్నారు.అసలు ఇంతటి దారుణానికి కారణమైన చోక్‌హోల్డ్ విధానాన్ని నిషేధించాలని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం నిరసనకారుల వ్యాఖ్యలతో ఏకీభవించారు.ఈ కఠిన పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
అదే సమయంలో ప్రత్యేక పరిస్ధితుల్లో నిందితులతో ఒంటరిగా తలపడాల్సి వచ్చినప్పుడు పోలీసులు దీనిని అనుసరించాల్సి రావొచ్చంటూ బలగాలకు మద్ధతు పలికారు.
కాగా ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు సైతం చోక్‌హోల్డ్ పద్ధతిలోనే మెడపై కాలు పెట్టి నేలకేసి తొక్కి పెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఫ్లాయిడ్ నాకు ఊపిరి ఆడటం లేదు వదలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు.అతను చివరిసారిగా అన్న నాలుగు మాటలే ఇప్పుడు ఉద్యమానికి నినాదంగా మారాయి.

మరోవైపు 2014లో మరణించిన నల్లజాతి పౌరుడు ఎరిక్ గార్నర్‌ను కూడా అప్పటి పోలీసులు చోక్‌హోల్డ్ విధానంతోనే బంధించారు.మినియాపోలీస్ ఘటనపై దేశంలోని పోలీస్ వ్యవస్ధపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వైట్ హౌస్ దీనిని తీవ్రగా పరిగణిస్తోంది.త్వరలోనే పోలీసు వ్యవస్థ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.త్వరలోనే దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.దీనిలో చోక్‌హోల్డ్ పద్ధతిపై నిషేధం విధించే అంశాన్ని చేరుస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి వుంది.అధికారిక లెక్కల ప్రకారం… 2016-18 మధ్య పోలీసులు చోక్‌హోల్డ్ విధానం అవలంభించడంతో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు.