జనసేన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసి అధికారం వైపు అడుగులు వేయిద్దాం అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు.పార్టీ బలోపేతం మాట పక్కన పెడితే ,అసలు ఇప్పటి వరకు పవన్ వెంట నడుస్తున్న వారికి కూడా ఆ పార్టీ పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒంటరిగా ముందుకు వెళ్తే పార్టీ పరిస్థితి మరింత దెబ్బతింటుందని, ఈ నాలుగేళ్ల పాటు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసి రాజకీయంగా బలం పెంచుకునేందుకు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించి దానికి అనుగుణంగా బీజేపీతో కలిసి అడుగులు ముందుకు వేసాడు పవన్.అయినా జనసేన నాయకుల్లో అలుముకున్న నిస్తేజం ఇంకా పోలేదు.
పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా, ఆయన వెంట సభలు, సమావేశాలకు హాజరు అవుతూ వస్తున్న ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం పవన్ పక్కన కనిపించకపోవడంతో అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి.పవన్ తీరుపై గుర్రుగా ఉన్నారని, ఆయన తొందర్లోనే అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నారనే రకరకాల కథనాలు నాదెండ్లపై వస్తున్నాయి.
అయినా ఈ విషయంపై జనసేన పార్టీ తరఫున ఎవరు స్పందించేందుకు ఇష్టపడడం లేదు.నాదెండ్ల ఒక్కరే కాదు, గతం నుంచి చూసుకుంటే పవన్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు చాలా మంది ఇప్పుడు జనసేన లో కనిపించడం లేదు.
దీనికి కారణం పవన్ వ్యవహరిస్తున్న తీరే కారణం అన్నట్టుగా ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్న మారిశెట్టి రాఘవయ్య, శరత్ మరార్, రాజు రవితేజ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది నాయకులు పవన్ వ్యవహార శైలితో పార్టీకి దూరం అయ్యారని, పవన్ మాటలు, చేతలు కారణంగా వీరు ప్రజల్లో మరింత చులకన అవుతామని భావంతో పవన్ కు దూరం అయినట్లు తెలుస్తోంది.ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరినా అది పవన్ కు చాలా ఇబ్బందే.పవన్ వ్యవహారశైలిపై మిగతా నాయకుల్లో కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయి.
అదే జరిగితే జనసేన పార్టీ ఉనికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం పార్టీలో నాదెండ్ల వ్యవహారం చర్చగా మారింది.
ఆయన పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతారా లేక మరేదైనా పార్టీలో చేరతారా ? ఒకవేళ చేరితే జనసేన, పవన్ మీద ఏమైనా విమర్శలు చేసే అవకాశం ఉందా ఇలా అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి.