ముందు జిఎన్ రావు కమిటీ, తరువాత బోస్టన్ కమిటీ, దీనిపై హైపవర్ కమిటీ ఇలా రాజధానిపై ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ అనేక కోణాల్లో ప్రజల అభిప్రాయాన్ని,నిపుణుల సూచనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.మొదటి నుంచి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఇష్టపడిన జగన్ అక్కడ పెట్టుబడి పెట్టడం అనవసరం అనే భావనలో ఉన్నాడు.
అయినా గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి తాత్కాలిక భవనాలు కూడా నిర్మించింది.అయితే అక్కడ ఒక సామాజిక వర్గం ప్రజల కోసమే అమరావతి నిర్మిస్తున్నారు అంటూ జగన్ అప్పట్లో విమర్శలు చేశారు.
ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్న జగన్ అమరావతి, విశాఖ, కర్నూలు ఈ మూడు చోట్ల రాజధానిగా ప్రకటించి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం అంటూ ప్రకటించాడు.దీనిపై మిగతా రెండు ప్రాంతాల్లో జగన్ నిర్ణయానికి మద్దతు లభించింది.

అమరావతి ప్రాంతంలో ఇప్పటికీ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో నిన్న బోస్టన్ కమిటీ నివేదిక అందించింది.ఆ నివేదిక లోని సమాచారం ప్రకారం రాజధానిగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం దండగ అని బోస్టన్ కమిటీ రిపోర్టులో ఉందట.అమరావతికి పెట్టే పెట్టుబడి గోడకు కొట్టిన సున్నం అని, అక్కడ పెట్టే ఖర్చులో 10 శాతం విశాఖలో పెడితే హైదరాబాద్ ను మించిపోయే అంత నగరం అవుతుందని తమ నివేదికను ఇచ్చినట్టు సమాచారం.
ఈ కమిటీల నివేదికలు పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే హైపవర్ కమిటీని నియమించింది.ఈనెల ఆరో తేదీన రెండు నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించబోతుంది.8వ తేదీన రెండు నివేదికలపై క్యాబినెట్లో చర్చించబోతున్నారు.ఈనెల 20వ తేదీన హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుంది.

ఆ నివేదిక సారాంశం ప్రకారం జగన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ కమిటీ నివేదిక మొత్తం జగన్ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని ముందుగానే అందరూ ఊహించారు.ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా దీనిపై విమర్శలు చేస్తోంది.అయితే ఎవరు ఎంతగా ఆందోళన చెందినా, విమర్శలు చేసినా జగన్ మాత్రం అమరావతిని రాజధానిగా చేసేందుకు ఇష్టపడడం లేదు.
ఆయన దృష్టి మొత్తం మీద విశాఖ మీదే ఉంది.అయితే దానిని జగన తన అభిప్రాయంగా చెప్పకుండా ఇలా కమిటీల పేరుతో పూర్తిస్థాయిలో పరిశీలన చేయించి ఆ తరువాత నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేవిధంగా ప్రయత్నిస్తున్నాడు.







