తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఖమ్మం జిల్లా రాజకీయాలు గందరగోళంలో పడేస్తున్నాయి.తెలంగాణలో రాజకీయాలన్నీ ఒక రకంగా ఉంటే ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో రకంగా ఉంటూ వస్తున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఆదరణ తక్కువగానే ఉంటూ వస్తోంది.ఇక్కడ పది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఒక సీట్లో మాత్రమే విజయం సాధించింది.
దీనికితోడు ఈ జిల్లాలో టిఆర్ఎఎస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు ఆ పార్టీని మరింత కలవరానికి గురిచేస్తోంది.ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి లలో ఎవరో ఒకరు బీజేపీ లో చేరడం ఖాయమని పెద్దఎత్తున ప్రచారం ఊపందుకుంది.
ఈ జిల్లాలో తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇద్దరికీ మంచి పట్టు ఉంది.అయితే ఈ ఇద్దరు నేతలకు మధ్య వర్గ పోరు తీవ్రంగా నడుస్తోంది.
దీంతో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదట.

అది కాకుండా తుమ్మల నాగేశ్వరావును పార్టీ మారాలని అనుచరులు కూడా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే తుమ్మల వియ్యంకుడు గరికపాటి రామ్మోహన్ బిజెపిలో చేరడంతో ఆయన నుంచి కూడా తుమ్మల కు ఒత్తిడి ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది.పొంగులేటి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కుంటున్నారట.
కాకపోతే వచ్చే ఏడాది ఏప్రియల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి.ఈ రెండు స్థానాలకు, అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఇప్పటి నుంచే నెలకొంది.
ఇందులో ఒక సీటు తుమ్మల గాని పొంగులేటి గాని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే రాజ్యసభ సీటు విషయంలో తుమ్మల మొదటి నుంచి అయిష్టతనే వ్యక్తం చేసే వారిని, తనకు హిందీ, ఇంగ్లీష్ మాట్లాడడం రాదని చెప్పేవారని ఇప్పుడు కొంతమంది గుర్తు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తుమ్ములకు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉంది.ఎమ్మెల్యేగా ఓటమి చెందినా సీనియర్ నాయకుడిగా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేస్తారని తుమ్మల ఆశపడ్డారు.
అయితే కేసీఆర్ మాత్రం పువ్వాడ అజయ్ వైపు మొగ్గుచూపి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు.ఇక అప్పటి నుంచి తుమ్మల పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు.

ఇక పొంగులేటి విషయానికి వస్తే 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్ లో చేరారు.పార్టీలోను, జిల్లాలోనూ పట్టు పెంచుకుని బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయినా 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ సీటు దక్కలేదు.దీనికి ప్రధాన కారణం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమికి కృషి చేశారని ఆరోపణలు వచ్చాయి.
అందుకే కెసిఆర్ పొంగులేటిని పక్కనబెట్టి టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు కు టికెట్ ఇచ్చారు.దీంతో అసంతృప్తికి గురైన పొంగులేటి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం అప్పట్లో జరిగింది.
అయితే అప్పుడు అధిష్టానం రంగంలోకి దిగి ఆయనకు నచ్చజెప్పడంతో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు, ఆ మేరకు పొంగులేటి పార్టీని వీడే ఆలోచన పక్కన పెట్టినట్టు ప్రచారం జరిగింది.అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తుమ్మల, పొంగులేటి ఇద్దరు బిజెపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
కానీ ఈ ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరం కారణంగా ఒకరు మాత్రమే బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.ఒకరు బీజేపీలో చేరితే మరొకరు టీఆర్ఎస్ లోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.







