ఎన్నికలకు ముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదంలో చిక్కుకున్నారు.ఆయన వయసులో ఉన్నప్పుడు స్నేహితులతో గడిపిన వీడియోలో నల్లజాతి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో 1990కి చెందినదిగా తెలుస్తోంది.
తెల్ల టీ షర్ట్ ధరించిన ట్రూడో పెదవులతో సహా ముఖం మొత్తం నల్లరంగు పులుముకుని ఇద్దరు తెల్లజాతి అమ్మాయిల మధ్యలో నిల్చొని బిగ్గరగా నవ్వుతూ గాల్లోకి చేతులు ఊపుతున్నాడు.1990లలో సినిమా ఇండస్ట్రీకి చెందిన తెల్లజాతి వ్యక్తులు ముఖానికి ఇలాగే నల్లరంగు పులుముకుని జాత్యహంకారాన్ని ప్రదర్శించేవారు.ఆ సమయంలోనే ట్రూడో సైతం ఇదే తరహా చర్యలకు పాల్పడటంతో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.

2001 టైమ్ మ్యాగజైన్ ఇయర్ బుక్‌లో సైతం ట్రూడో నల్లరంగు వేసుకున్న ఫోటోలు ప్రచురించింది.ఆ పత్రిక కథనం ప్రకారం ట్రూడో ముఖానికి నల్లరంగుతో అల్లాడిన్ దుస్తులు వేసుకుని, ప్రఖ్యాత అమెరికా పౌరహక్కుల కార్యకర్త హ్యారీ బేలాఫొంటే రాసిన జానపద గీతాన్ని పాడుతున్నాడు.సదరు వీడియో కెనడాలో పెనుదుమారాన్ని రేపడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు.ఆ వీడియో 20 ఏళ్ల క్రితం తాను గాలాలోని ప్రైవేట్ స్కూల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాటిదని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ ఘటనపై సొంత పార్టీ నేత, రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ స్పందించారు.ట్రూడో చర్య తప్పేనని, అయితే ఆయన సోషలిస్ట్ భావాలను సైతం గుర్తించాలని కోరారు.
కాగా.అక్టోబర్ 21న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.







