అధికారం ఉంది కదా అని వెనుకా ముందు చూసుకోకుండా చెలరేగిపోతే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కి తెలిసొచ్చినట్టు ఉంది.గత ప్రభుత్వంలో తన పలుకుబడంతా ఉపయోగించి వ్యవహారాలు చేయడంతో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని తవ్వి తీస్తోంది.
ఒక్కో వ్యవహారాన్ని బయటకు తీయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తుండడంతో ఆయనలో ఆందోళన పెరిగిపోతోంది.తరిగిపోతున్న తన రాజకీయ ప్రతిష్టను చూసి కుమిలిపోతున్నారు.
హుందాగా సాగాల్సిన రాజకీయ జీవితంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉంటాయని ఉహించలేదంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.పూలమ్మిన చోటే, కట్టెలమ్మాల్సిన దారుణమైన పరిస్థితి రావడంతో పాటు తన రాజకీయ వారసులుగా పొలిటికల్ ఎంట్రీ ఇప్పిద్దామని చూసిన తన కుమారుడు ఈ వివాదాల్లో చిక్కుకుని అపకీర్తి మూటగట్టుకోవడంతో కోడెలలో మరింత బెంగ పెరగడానికి కారణమట.

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా రికార్డు దక్కించుకున్న కోడెలకు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది.స్పీకర్‌గా విచక్షణాధికారాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికార పార్టీ, ఇప్పటికే విచారణలు చేస్తోంది.కొడుకు, కుమార్తెలు ‘కె’ ట్యాక్స్ వసూలు చేస్తూ, అవినీతిలో చెలరేగిపోయారని కేసులు కూడా ఫైల్ అయ్యాయి.హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు కోడెల మీద ఉన్నాయి.
అంతే కాదు సొంత భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భారీ ఎత్తున అద్దె వసూలు చేశారన్న ఆరోపణలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారం కోడెల పరువు మొత్తం చేసేలా చేసింది.దీనిపై ఆయన సొంత పార్టీ టీడీపీ మద్దతు కూడా ఆయనకు లభించడంలేదు.
అసెంబ్లీ ఫర్నీచర్‌పై కోడెల కొన్ని అబద్దాలు చెప్పారనడానికి సాక్ష్యాలు చూపిస్తున్నారు వైసీపీ నేతలు, అధికారులు.ఖరీదైన ఫర్నీచర్ తన కుమారుడి మోటార్ షోరూంలో ఉండడంతో కోడెల అడ్డంగా దొరికిపోయారు.

ఈ పరిస్థితుల్లో కోడెల పై నరసారావు పేట నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాల భగ్గుమంది.ఆయనను తప్పిస్తారా లేదంటే ఉద్యమం చేయాలా అంటూ ఏకంగా చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారు టీడీపీ నాయకులు.అయితే ఈ విషయంలో తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ స్పీకర్‌ను ఏమీ అనలేక, కార్యకర్తల గోడు తోసిపుచ్చలేక, సతమతమైపోతున్నారు చంద్రబాబు.వైసీపీ అధికారంలోకి రావడంతో, జాగ్రత్తగా ఉండకుండా కోడెల, వరుస తప్పులు చేస్తూ వైసీపీకి దొరికిపోయారు.
కోడెల నిజాయితీగా ఫర్నీచర్ టైంలోగా ఇచ్చేసి వుంటే, ఇంత రాద్దాంతం జరిగేది కాదని, పార్టీ పరువు కూడా పోయేది కాదని, టీడీపీ నేత వర్ల రామయ్య బాహాటంగానే చెప్పడం చూస్తుంటే టీడీపీ కూడా ఈ విషయంలో చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది.ఇవన్నీ పక్కనపెడితే తన కుమారుడు, కుమార్తె రాజకీయ వారసత్వం ఏమవుతుందోనన్న బెంగ ఇప్పుడు ఆయనలో ఎక్కువ కనిపిస్తోంది.
కొడుకు, కుమార్తెలు, తనతో పాటు తీవ్ర వివాదాల్లో ఇరుక్కోవడం, కోడెలను తీవ్రంగా మనోవేదనకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.కోడెల కుమారుడు శివరాం, ఇప్పటికే సత్తెనపల్లిలో యువ నాయకుడిగా పేరు తెచ్చుకునే పనిలో ఉండగానే ప్రభుత్వం మారడం, వరుస వరుసగా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడినట్టు కనిపిస్తోంది.
.






