జనసేన పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సమీక్ష, సమావేశాలు ఆ పార్టీలో కొంచెం ఊపు తెస్తున్నట్టే కనిపిస్తున్నాయి.ప్రతి సమావేశంలోనూ పవన్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగిస్తూ అభిమానుల్లో జనసేన మీద నమ్మకం సడలకుండా చూసుకుంటున్నాడు.
ఇప్పుడు మనం ఒక్క సీటుతోనే సరిపెట్టుకున్నాం కానీ భవిష్యత్తులో మొత్తం అసెంబ్లీ లో సీట్లన్నిటిని ఆక్రమిస్తాం అంటూ పవన్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సమావేశాలకు ఓడిన అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
కానీ ఈ సమావేశాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

మొన్నటి వరకు ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొన్న నాగబాబు తాను పోటీ చేసిన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టడం వెనుక కారణాలు ఏంటి అనేదానిమీద అందరి దృషి పడింది.పవన్ తాను ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నరసాపురంలో నిర్వహించారు.ఎన్నికలకు ముందు జనసేనలో చాలా చురుకైన పాత్ర పోషించడంతో నాగబాబుకు పవన్ నరసాపురం ఎంపీ సీటు ఇచ్చారు.
అయితే ఇది అప్పట్లో వివాదాస్పదం కూడా అయ్యింది.ఎందుకంటే తాను తన పార్టీలో కుటుంబ పాలన చేయనని చెప్పిన పవన్ ఇప్పుడు తన అన్నకు ఎలా టికెట్ ఇచ్చాడని పలువురు విమర్శలు చేశారు.
అయితే ఆయన ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో పాటు మూడో స్థానానికి వెళ్లిపోయారు.

ఎన్నికల తరువాత కూడా నాగబాబు అధినేత పవన్ ను ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు అంటూనే పవన్ ఏమి చెప్పినా గుడ్డిగా చేసుకుపోవాల్సిందే అని వ్యాఖ్యానించి సంచలనం రేపారు.కానీ ఆ మాటలు పవన్ కు నచ్చలేదని, అందుకే నాగబాబు కు ఆ తరువాత గట్టిగా క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది.దీని కారణంగానే నాగబాబు ఆ సమావేశం తరువాత నుంచి పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదనే ప్రచారం జరుగుతోంది.
అదీ కాకుండా ఇంకా ఎన్నికలకు ఐదేళ్ల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ఎంత గొంతు చించుకున్నా అనవసరం అనే భావన కూడా ఆయనలో ఉన్నట్టు కనిపిస్తోంది.







