జనసేన పార్టీకి సంబంధించి రోజుకో వ్యవహారం బయటకి వస్తూ రాజకీయ సంచలనం కలిగిస్తోంది.ఎన్నికల ఫలితాలు విడుదలయిన చాలా కాలం తరువాత పవన్ జనసేన పార్టీ మీద దృష్టిపెట్టాడు.
ఆ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలనాటికి అధికారంవైపు నడిపించాలని పవన్ భావిస్తున్నాడు.దీనిలో భాగంగా పవన్ పార్టీకి సంబంధించి అనేక అనుబంధ కమిటీలను నియమిస్తూ హడావుడి చేస్తున్నాడు.
పార్టీలో ఇటువంటి కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నా ఆ పార్టీ నాయకుడు, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో పార్టీలో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఆయన్ను కావాలని దూరం పెడుతున్నారా లేక ఆయనే దూరంగా జరుగుతున్నారా అనే విషయంలో ఏ క్లారిటీ తేలకుండా ఉంది.
ప్రస్తుతానికైతే లక్ష్మీనారాయణ పార్టీలోనే కొనసాగుతున్నారు.ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నా జనసేనతోనే ఉంటాను అన్నట్టుగా కొంతకాలం క్రితం వరకు ప్రవర్తించారు.అయితే ఇప్పడు మాత్రం ఆయన ఒంటరి అయ్యారా అనే సందేహాలు కలుగుతున్నాయి.నిన్న మొన్నటి దాకా జనసేన పార్టీలో చురుకైన పాత్ర పోషించిన జేడీ, అనూహ్యంగా ఇప్పుడు దూరంగా జరగడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు గా అర్ధం అవుతోంది.
పార్టీలోని పవన్ కోటరీగా చెప్పబడుతున్న నాయకుల కారణంగానే జేడీ ప్రాధాన్యత బాగా తగ్గినట్టు ఆయన అనుమానిస్తున్నాడు.జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నీతి,నిజాయితీ కలిగిన అధికారిగా అందరిచే కీర్తింపబడ్డాడు.
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయినా పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించారు.

అంత ఇమేజ్ ఉన్న ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఒంటరిగా మిగిలిపోయినట్టుగా కనిపిస్తున్నారు.విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత కూడా జనసేన సమావేశాలకు జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.అంతే కాకుండా విశాఖ నియోజకవర్గంలో చాలా వరకు పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.పార్టీలో అంత క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయన పార్టీ వీడుతారా అనే అనుమానం అందరికి కలుగుతోంది.
పవన్ తాజాగా ప్రకటించిన అనేక కమిటీల్లో లక్ష్మీనారాయణకి స్థానం లేకపోవడంతో పార్టీలో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని జేడీ గుర్రుగా ఉన్నాడట.అయితే ఆయనకు పార్టీ ఫండ్ రైజింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండాలని కోరినప్పటికీ, ఆ పదవి తీసుకునేందుకు జేడీ సున్నితంగా తిరస్కరించారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఎందులో ఏ నిజం ఉందో తెలియదు కానీ జనసేనకు జేడీకి మధ్య పూడ్చలేనంత స్థాయిలో గ్యాప్ అయితే పెరిగినట్టు అందరికి అర్ధం అవుతోంది.







