తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముద్దుగా పిలుచుకునే చంద్రబాబు తనయుడు లోకేష్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోతున్నాడు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడం, కేసుల భయంతో చాలామంది టీడీపీ నాయకులు ఆ పార్టీని టచ్ చేయడానికి జంకుతున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా లోకేష్ ఈ మధ్య కాలంలో స్పీడ్ అవ్వడమే కాకుండా వైసీపీ మీద సోషల్ మీడియా వేదికగా కౌంటర్ లు వేస్తున్నాడు.వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆధారాలతో సహాయ ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నాడు.
అది కూడా అచ్చ తెలుగులోనే కావడం గమనార్హం.లోకేష్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా వైసీపీతో పాటూ బీజేపీని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తున్నారు.
సబ్జెక్ట్‌లవారీగా సమాచారంతో ట్వీట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయాలపై విమర్శలు వస్తే వాటికి సంబంధించిన ఆధారాలను ట్వీట్‌ల ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ మధ్య తెలుగులో ఎక్కువశాతం ట్వీట్లు చేయడం వెనుక పెద్ద కారణం కూడా ఉందట.కేవలం సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చేందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా కొంతమంది సహాయకుల్ని పెట్టుకున్నారట.
తాజాగా వైఎస్‌ఆర్ పింఛన్ కానుకపై అబద్దాలు చెబుతున్నారంటూ ట్వీట్లు వదిలారు చినబాబు.మళ్లీ కొద్దిసేపటికే వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని లోకేష్ టార్గెట్ చేశారు.వెంటనే మరో ట్వీట్ వదిలారు.గతంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున పవర్ ప్లాంట్ వ్యవహారంలో భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాల్పులు జరిపిన ఘటనను, కాకరాపల్లి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు , అప్పటి వైఎస్ ప్రభుత్వ హయాంలో కాల్పులు జరిపిన ఘటనలకు సంబంధించిన పేపర్ కటింగ్‌లను వాటికి జత చేశారు.
వైసీపీ మీద ఎదురుదాడి చేయడానికి పార్టీ నేతలంతా జంకుతున్న సమయంలో లోకేష్ ఇలా స్పీడ్ పెంచడం నాయకుల్లో కూడా ఉత్సాహాన్ని కలిగిస్తోంది.ఇదే స్పీడ్ తో ముందుకు వెళ్లడమే కాకుండా సందర్భాన్ని బట్టి ప్రజలతో మమేకం అవుతూ ఉంటే లోకేష్ లో నాయకత్వ లక్షణాలు పెరగడమే కాకుండా చంద్రబాబు రాజకీయ వారసుడిగా టీడీపీ పగ్గాలు చేపట్టడానికి తగిన అర్హతలు, శక్తి సామర్ధ్యాలు వస్తాయని మెజార్టీ టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే లోకేష్ ముందు ముందు ఇదే స్పీడ్ కొనసాగిస్తాడో లేక స్లో అయిపోతాడా అనేదానిపైనే అతని రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.







