ఒకవైపు చూస్తే భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా మారుతోంది.ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేయడంతో నాయకులంతా హడావుడిగా ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.
పోలింగ్ తేదీకి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తున్నారు.ఎండా ఎక్కువగా ఉందని రిలాక్స్ అయితే ప్రత్యర్థులు బలపడతారనే ఆలోచనతో ఎండలో సైతం తిరుగుతూ ప్రచార కార్యక్రమాల్లో కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు నిమగ్నం అయిపోతున్నారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు.ఏపీలోని రాజమండ్రితో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు.అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలోని మూడు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు.జహీరాబాద్, వనపర్తి, హజూర్‌నగర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నేడు కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే పులివెందులతో పాటు జమ్ములమడుగు, తంబళ్లపల్లె, పూతలపట్టు ఎన్నికల సభల్లో పాల్గొంటారు.అలాగే విజయ నగరం జిల్లా శృంగవరపు కోట, విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే తమ అసలు టార్గెట్‌గా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్నిసాగిస్తోంది.సీఎం కేసీఆర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైదరాబాద్ పరిధిలో రోడ్‌షోలు నిర్వహించబోతున్నారు.
ఎల్బీనగర్, మహేశ్వరం పరిధిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.ఇలా నిత్యం నాయకులంతా మండుటెండలను సైతం లెక్కచేయకుండా వరుస వరుసగా పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


.




