గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం అనంతరం ఊహించని పరిణామాల మధ్య మళ్ళీ బీజేపీ సర్కార్ తన బలం నిరూపించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఊహించని విధంగా ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇంకా కొన్ని రోజులు కాకుండానే సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి.
మంగళవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు.
ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్ అజ్‌గావోంకర్, దీపక్ పావస్కర్‌లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ మైఖేల్ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు.అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు.

తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూర్చి, కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.దీంతో ఇప్పుడు బీజేపీ సంకీర్ణ సర్కార్ బలం ఒకటి తగ్గింది.ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది.
.






