ఏపీలో టీడీపీ- బీజేపీ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది.నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ ని బీజేపీ నేతలు అడ్డుకోవడం….
బాబు వారిమీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా పెద్ద సంచలనం అయిపొయింది.అయితే నిన్నటితో ఆ గొడవ ముగిసిపోయింది ఆనుకుంటున్న సమయంలో గుంటూరులో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
![](https://telugustop.com/wp-content/uploads/2019/01/TDP-Leaders-Attack-On-Kanna-Laxminarayana-At-His-Home-1.jpg)
నిన్న కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా ఈరోజు కన్నా ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో తెదేపా ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు.కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.
ఈ దశలో కన్నా నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
దాంతో బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు.ధర్నాకు వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు.
అక్కడి నుంచి తరిమి కొట్టారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
అయితే ఈ వ్యవహారంపై స్పందించిన కన్నా… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు.తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
గతంలో అమిత్‌షా, జగన్, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.
![](https://telugustop.com/wp-content/uploads/2019/01/TDP-Leaders-Attack-On-Kanna-Laxminarayana-At-His-Home.jpg)
ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయన్నారు.సీఎం ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారని విమర్శించారు.కాకినాడలో ఒక మహిళా కార్పొరేటర్‌ను ఫినిష్ అయిపోతావని సీఎం హెచ్చరించడాన్ని చూసుకునే ఈరోజు టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి ప్రయత్నించారన్నారు.
ఇప్పటికే … టీడీపీ – బీజేపీ పార్టీల మధ్య పోరు ముదిరి పాకానపడింది.
ఒకవైపు జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగి ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు బాబుని బీజేపీ నేతలు అడ్డుకోవడం… వారిని బాబు తిట్టడం… ఇప్పడు గుంటూరులో ఈ ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే ఇక ముందు ముందు ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.