గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఎప్పుడూ లేనంతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ విమర్శలను వైసీపీ అధినేత జగన్ పై గురిపెట్టాడు.
సందర్భం వచ్చినా… రాకపోయినా … కల్పించుకుని మరీ జగన్ ను… ఆ పార్టీని ఏదో ఒక సందర్భంలో విమర్శిస్తూనే ఉన్నాడు.అంతే కాదు.
అకస్మాత్తుగా టీడీపీ పై విమర్శల దాడిని కూడా తగ్గించాడు.ఈ విషయం గురించే కొద్ది రోజులుగా… రకరకాల కధనాలు కూడా వస్తున్నాయి.
అయినా పవన్ మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ… వస్తున్నాడు.అయితే జగన్ ను జనసేనాని టార్గెట్ చేసుకోవడం వెనుక మాత్రం పెద్ద కథే ఉందట.

పవన్ ఈ స్థాయిలో జగన్ మీద రెచ్చిపోవడానికి కారణం ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ చేయించుకున్న అంతర్గత సర్వేలే కారణం అని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం పవన్ ఉభయగోదావరి జిల్లాలు.అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలపైనే మొత్తం ఫోకస్ అంతా పెట్టాడు.ఈ సందర్భంగా అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉంది… ఎన్నికల తరువాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నాడట.
వాటిల్లో తేలింది ఏమిటంటే ఈ ప్రాంతంలో జగన్ హవా ఎక్కువగా ఉందని… చాపకింద నీరులా వైసీపీ బలపడుతోందని రిపోర్ట్స్ అందాయట.

పవన్ గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతాలపైనే తన ఫోకస్ అంతా పెట్టినా… పెద్దగా అయితే ఫలితం కనిపించలేదు అన్నట్టుగా సర్వే ఫలితాలు తేల్చేశాయట.అందుకే పవన్ కల్యాణ్ జగన్ నే లక్ష్యంగా చేసుకుంటున్నాడు.తను అంతగా తిరుగుతున్నా జనాలు తన వైపు చూడకుండా.
జగన్ వైపు మొగ్గు చూపుతుండే సరికి పవన్ కల్యాణ్ కు అసహనం పెరిగిపోతూ ఉందని సమాచారం.ఇలాంటి నేపథ్యంలో ఈ అసహనాన్ని పవన్ ఈ విధంగా చాటుతున్నాడని తెలుస్తోంది.
జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు.ఆఖరికి జగన్ కులం విషయంలో కూడా పవన్ విమర్శలు చేస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
ఇంకో విషయం ఏంటి అంటే… జగన్ మీద కోడి కత్తి దాడి జరిగితే తాను సానుభూతి తెలిపానని… జగన్ మాత్రం తన కాన్వాయ్ మీదకు ఇసుకలారీ దూసుకు వస్తే కనీసం స్పందించలేదు అంటూ… విమర్శించాడు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే… పవన్ ఎన్ని విమర్శలు గుప్పించిన సరే జగన్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు.







