ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం కలిసి వ్యూహాలు రూపొందించి… ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా కోదండరాం… కోదండరాం కి అండగా కేసీఆర్ ఇలా కలిసి మెలిసి ఉన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే కోదండరామ్ కు కీలకమైన పదవి ఏదో దక్కుతుందని అంతా భావించారు.
కానీ ఆ తరువాత వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.కోదండరాం సొంతగా తెలంగాణ జనసమితి ( టీజేఎస్) పార్టీ పెట్టేసారు.
ప్రస్తుతం మహాకూటమిలో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో జతకట్టారు.అయితే ఈ పరిణామాలన్నీ కేసీఆర్ కి రుచించడంలేదు.
అందుకే ఇప్పుడు ఆయన హవా తగ్గించేందుకు కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నాడు.

కోదండరాం మహాకూటమిలో యాక్టివ్ అవ్వడంతో.ఒక వేళ ఆయన ఎన్నికల్లో గెలిస్తే… తన మీద విమర్శల అస్త్రాలు సంధించి ఇబ్బంది పెడతాడని కేసీఆర్ ముందుగానే గ్రహించేసాడు.అందుకే కోదండరాం పోటీచేసే స్థానంపైనే కాకుండా … ఆయన పార్టీ అభ్యర్థులు పోటీచేసే అవకాశం ఉన్న స్థానాలపై కేసీఆర్ ఇప్పుడు ప్రధానంగా దృష్టిపెట్టాడు.
కోదండరాం పోటీచేసే స్థానాల్లో ముఖ్యమైనది రామగుండం.మహాకూటమిలో భాగంగా ఇక్కడి నుంచే కోదండరాం పోటీచేస్తారని తెలుస్తోంది.ఈ సీటులోనే ఆయన పోటీచేస్తారని వార్తలు లీక్ అయ్యాయి.కోదండరాం గెలిస్తే ఏకు మేకు అవుతాడని గ్రహించి కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం

పార్టీ శ్రేణులు… ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం కోదండరాం పోటీచేసే నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో టీజేఎస్ కు ఎంత బలముంది.? ఇక్కడున్న సింగరేణి కార్మికుల్లో ఉన్న ఆదరణ, మిత్రపక్షాలు ఏ స్థాయిలో సహకరిస్తాయనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.కోదండరాంను ఓడించేందుకు ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ లకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు సమాచారం.మహాకూటమిలో ప్రధాన నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాంలపై ఫుల్ ఫోకస్ పెట్టిన కేటీఆర్ వీరిద్దరిని ఓడిస్తే కాంగ్రెస్ కూటమి కుదేలవురుతుంది అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు.
మొత్తంగా చూస్తే కోదండరాం పై పీకలదాకా కోపం పెంచుకున్నట్టే కనిపిస్తోంది.







