ఏముందో ఏమో కానీ గత కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రకరకాలా ప్రయోగాలు జరుగుతున్నాయి.ఈ ప్రయోగాలు జగన్ కలిసొచ్చే అంశంగా చూస్తున్నా… పార్టీ నేతలకు మాత్రం మింగుడుపడడంలేదు.
పార్టీ అధికారంలోకి రావడమే తనకు ముఖ్యం … ఈ దశలో నేను తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా ఫర్వాలేదు అన్న ధోరణిలో జగన్ కనిపిస్తున్నాడు.కానీ ఈ సందర్భంలో పార్టీ కోసం కష్టపడి.
పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులకు జగన్ హ్యాండ్ ఇవ్వడం ఎవరికీ రుచించడంలేదు.జగన్ లో ఇంత అకస్మాత్తుగా ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అని పార్టీలో ఒకటే చర్చ జరుగుతోంది.
అయితే దీని వెనుక జగన్ సొంత సర్వే ఉన్నట్టు తెలుస్తోంది.

కేవలం సర్వే పేరుతో విధేయులను, అంకితభావంతో పనిచేసేవారిని పక్కనపెడుతున్నారని ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసిన లేళ్ల అప్పిరెడ్డి పరాజయం పాలయ్యారు.అప్పటినుంచి ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు.
పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేసుకుపోయారు.గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నాలుగు పర్యాయాలు పాదయాత్ర ద్వారా నియోజకవర్గాన్ని చుట్టివచ్చిన నేతగా అప్పిరెడ్డికి పేరుంది.
అయినా ఆయన్ను పక్కనపెట్టేశారు.

వారం రోజుల క్రితం విశాఖజిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ అప్పిరెడ్డిని పిలిపించుకున్నారు.ఈసారికి గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఇవ్వలేననీ, అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పదవి ఇస్తాననీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.బాగా డబ్బుపెట్టే మాజీ అధికారి ఒకరు వచ్చారనీ, కుల సమీకరణాల్లో కూడా అతనే సరైన వ్యక్తి అనీ వివరించారట.
ఆ వచ్చింది మాజీ పోలీస్ అధికారి ఏసురత్నం అని కూడా చెప్పారట.ఈ మొత్తం వ్యవహారం వెనుక కూడా సర్వే నివేదికే ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌ను మార్చేసి.కేవలం డబ్బులున్నాయన్న భావనతో విడదల రజనీ పేరును తెరపైకి తెచ్చారు.కులసమీకరణాల్లో భాగంగా లావు శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మార్చారు.ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్యను గుంటూరు పార్లమెంట్ స్థానంలో సమన్వయకర్తగా నియమించారు.ఈ మార్పులను వైసీపీ నేతలు కొంతమేర స్వాగతించినా అత్యంత సన్నిహితుడైన అప్పిరెడ్డి పేరును మార్చి వేరేవారికి అవకాశం ఇవ్వడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు.అయితే జగన్ తన సొంత సర్వే రిపోర్ట్ ప్రకారం మరిన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేసేందుకు సిద్ధం అవుతుండడంతో నియోజకవర్గ ఇంచార్జీల్లో దడ మొదలయ్యింది.







