తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి.
కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి.
కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు.అనంతరం డీఎంకే జెండాను కప్పారు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.
ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు.ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

ఎం కరుణానిధికి 2016 ముందు వరకు పెద్దగా అనారోగ్యం ఏమీ లేదు, వృద్ధాప్యంతో అడపాదడపా ఎదురయ్యే సమస్యలు తప్ప.అయితే ఆ తరువాత ఆయన వరుగా అనారోగ్యానికి గురవుతూ వచ్చారు.అంతకుముందు 2000 సంవత్సరం మే మాసంలో వెన్నెముక నొప్పి కోసం, 2008 మే మాసంలో మెడనొప్పి కోసం ఆయన చికిత్స పొందారు.ఆ చికిత్స తరువాత ఆయన వీల్‌చైర్‌ను ఆశ్రయించారు.ఆ వీల్‌చైరే చివరి వరకు ఆయనకు ‘అన్నీ’ అయింది.
2016 సెప్టెంబరులో ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయన శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది.దాంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.అదే సంవత్సరం నవంబరులో మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి.శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు కాలేయంలో ఇన్ఫెక్షన్ నెలకొంది.దాంతో వైద్యులు ట్రకోస్టమీ ఏర్పాటు చేశారు.
ముక్కు, నోటితో సంబంధం లేకుండా నేరుగా శ్వాస పీల్చుకునేలా వైద్యులు గొంతుకు రంద్రం వేసి ట్రకోస్టమీ ఏర్పాటు చేశారు.అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమవుతున్నారు.పార్టీ పనులకూ ఆయన దూరంగా వుంటున్నారు.2017 ఆగస్టులో మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.ఆ సమయంలో వైద్యులు ట్రకోస్టమీ ట్యూబ్‌ను మార్చారు.
దంతవైద్యం కోసం కావేరీ ఆస్పత్రిలో చేరారు.
ఫిబ్రవరిలో ట్రకోస్టమీ ట్యూబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో మళ్లీ వైద్యులు మూడోమారు కొత్తపైపు వేశారు.ట్రకోస్టమీ ట్యూబు ద్వారా ఆహారం తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఉదరానికి రంద్రం వేసి ‘పెగ్ ట్యూబ్’ ద్వారా ఆహారం ఇచ్చారు.
చివరగా 2018 ఆగష్టు లో ఏం జరిగింది అంటే.

2018 ఆగస్టులో…
1: కరుణ కోలుకుంటున్నారని ఆస్పత్రి ప్రకటన.అరగంటపాటు కుర్చీలో కూర్చోబెట్టి ఫిజియో థెరపీ
5: ఉదయం కాలేయంలో తీవ్ర సమస్యను గుర్తించిన వైద్యులు.విపరీతంగా పెరిగిన కామెర్లు
6: సాయత్రం 6.30 గంటలకు క్షీణించిన అవయవాలకు చికిత్స చేయడం సవాలుగా మారిందంటూ ఆస్పత్రి ప్రకటన
7: మధ్యాహ్నం 2 గంటలకు అన్నా అరివాలయంలో సీనియర్ నేతలతో స్టాలిన్ సమావేశం
7: మధ్యాహ్నం 2.40 గంటలకు గ్రీన్‌వేస్‌లో వున్న సీఎం ఎడప్పాడి నివాసానికి వెళ్లిన స్టాలిన్, అళగిరి, కనిమొళి, టీఆర్‌బాలు, దురైమురుగన్, ఐ.పెరియస్వామి
7: 3.30 గంటలకు సీఎంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ భేటీ
7: సాయంత్రం 4 గంటలకు తక్షణం ఉన్నతాధికారులతో యూనిఫారంతో విధుల్లో చేరాలని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, ఎస్పీ, డీఐజీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ
7: సాయంత్రం 4.32 గంటలకు పూర్తిగా విషమించినట్టు కావేరీ ఆస్పత్రి ప్రకటన
7: సాయంత్రం 5 గంటలకు ఆస్పత్రి నుంచి రోదిస్తూ వెళ్లిపోయిన కరుణ కుటుంబంలోని మహిళలు
7: కరుణ కన్నుమూసినట్టు కావేరీ ఆస్పత్రి నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రకటన విడుదల