ప్రతిభ ఉండాలే గానీ దానికి చదువు, పేదరికం వంటివి అడ్డు కాదని గతంలో మనం ఎందరి విషయంలోనో చూశాం.ఏం చదువుకోకున్నా, డబ్బు లేకున్నా కేవలం తమ నైపుణ్యాలతోనే అద్భుతాలు చేసిన చూపిన చాలా మందిని గురించి గతంలో తెలుసుకున్నాం.
అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ యువకుడి గురించే.అతడే హేమంత్ మెహ్రా.
ఇంతకీ అతను ఏం చేశాడు.? అనేదేగా మీ డౌట్, ఇంకెందుకాలస్యం అతను సాధించిన కార్యమేమిటో తెలుసుకుందాం పదండి…
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన హేమంత్ మెహ్రా అప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు.చదువుల్లో ఎంతో ప్రతిభను కనబరిచే వాడు.ఎలాగైనా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాల్లో నిలవాలని అప్పటి నుంచే హేమంత్‌కు ఉండేది.అయితే అతను కన్న కలలు మాత్రం అంత సులభంగా నెరవేరలేదు.ఎందుకంటే అప్పుడే తన తండ్రి అనుకోకుండా దురదృష్టవశాత్తూ చనిపోయాడు.
దీంతో కుటుంబ భారం మొత్తం హేమంత్‌పై పడింది.ఈ క్రమంలో అతను చదువును మానేయాల్సి వచ్చింది.
అయితే హేమంత్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తన తండ్రి ఉద్యోగం తనకు వస్తుందేమోనని ఆశగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు.కానీ ఆ ఉద్యోగం రావాలంటే అతనికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలని అక్కడి అధికారులు తేల్చేశారు.
దీంతో గత్యంతరం లేక ఏదో ఒక చిన్నా చితక పనిచేసుకుని బతకాల్సి వచ్చింది.అయితే 18 ఏళ్లు వచ్చే సరికి ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా వస్తుంది కదా అనుకుని ఏదో ఒక జాబ్ చేసుకుంటూ హేమంత్ బతికేయ సాగాడు.
తీరా 18 ఏళ్లు వచ్చాక మళ్లీ వెళ్లి అడిగేసరికి అతనికి విద్యార్హతలు లేకపోవడంతో ఈసారి ఉద్యోగం ఇవ్వమని చెప్పేశారు.దీంతో హేమంత్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.
అయితే అప్పుడే ఓ న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనం హేమంత్ జీవితాన్ని మార్చేసింది.అదేమిటంటే…

వెబ్, యాప్ డెవలప్‌మెంట్‌కు మంచి డిమాండ్ ఉందని, అందులో ఉపాధి అవకాశాలు కూడా బాగానే ఉన్నాయని ఓ న్యూస్ పేపర్‌లో హేమంత్ చదివాడు.దీంతో అతనికి ఓ ఆలోచన వచ్చింది.ఎలాగైనా ఆ రంగంలో తాను రాణించాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా తన పని మొదలు పెట్టేశాడు.తమ పట్టణంలో సదరు కంప్యూటర్ కోర్సులను నేర్పించే వారు ఎవరూ లేకపోవడం, ఒక వేళ దూరం వెళ్లినా అందుకు తగిన డబ్బులు తన వద్ద లేకపోవడంతో హేమంత్ తమ ప్రాంతంలోనే ఉన్న ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఆయా కేఫ్‌లలో గంటల తరబడి కూర్చుని సదరు యాప్ డెవలప్‌మెంట్ కోడింగ్‌ను నేర్చుకోవడం మొదలు పెట్టాడు.స్వతహాగా బుద్ధిశాలి కావడంతో అతనికి త్వరగానే ఆయా కోర్సులు వచ్చేశాయి.
అయితే అదే సమయంలో తన నానమ్మ లాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యం అందించడంతో అతనికి ఆయా కోర్సులపై అవగాహన కల్పించుకునేందుకు ఇంకా ఎక్కువ సమయం దొరికింది.అలా దొరికిన సమయాన్ని హేమంత్ పూర్తిగా వాడుకున్నాడు.
ఎట్టకేలకు సొంతంగా తొలి యాప్‌ను తయారుచేశాడు.దాని పేరు Mappi.
అలా మొదలైన అతని యాప్‌ల డెవలప్‌మెంట్ ఇక ఆగలేదు.ఈ క్రమంలో అతను ఏకంగా గేమ్స్, యుటిలిటీస్ వంటి అంశాల్లో 15 యాప్‌లను అనతి కాలంలోనే డెవలప్ చేశాడు.
వాటి ద్వారా ఇప్పుడు అతనికి వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా.? నెలకు రూ.1 లక్ష.అవును, మీరు విన్నది నిజమే.
10వ తరగతి మానేసినా ఏకంగా యాప్ డెవలపర్‌గా మారిన హేమంత్ ప్రతిభను చూసిన తోటి యువకులు అతని వద్దకు వచ్చి అతని సలహాలు సూచనలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అంతేకాదు స్థానిక ఐటీఐ అధికారులు హేమంత్ వద్దకు వచ్చి యాప్ డెవలప్‌మెంట్ కోర్సులలో నిరుద్యోగులకు శిక్షణనిచ్చే విధంగా ముందుకు రావాలని కోరారు కూడా.
అందుకు హేమంత్ కూడా అంగీకరించడం విశేషం.ఇవే కాదు, ఇప్పుడు అతని ముందున్న పెద్ద లక్ష్యం ఏంటో తెలుసా.? ఏనాటికైనా యాప్ డెవలప్‌మెంట్‌లో పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలని.మనం కూడా అతని లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.!
.






