‘జేగంటలు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, ‘సీతాకోకచిలుక’తో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని, అలుపెరగని బాటసారిగా నిరంతరం సినిమాలు చేసి అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు ముచ్చర్ల అరుణ.పది సంవత్సరాల సినీ కెరీర్‌లో 70కు పైగా సినిమాల్లో నటించి, రికార్డు సృష్టించారు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం తనకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు.ఇటీవలే ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో పంచుకున్నారు.

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆమె జన్మించారు.చదువు హైదరాబాద్ లో సాగింది.ఆమె ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు అంట.ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ “మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో భారతీరాజా, నివాస్‌గారు నన్ను చూసి నా వెనకాలే ఫాలో చేస్తూ మా ఇంటికి వచ్చారు.‘మీరు సినిమాలో నటించాలి’ అని అడిగారు.‘నాకు నటనలో ఏబీసీడీలు కూడా రావు’ అన్నాను.‘మీరు ఆలోచించుకుని చెప్పండి’ అని వాళ్లు చెన్నై వెళ్లిపోయారు.నేనూ ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
అయితే, కొన్నాళ్లకు మళ్లీ భారతీరాజా, నివాస్‌గార్లు మా ఇంటికొచ్చారు.‘గోల్డెన్ ఛాన్స్ ఇది.వదులుకోకు’ అని మా కజిన్ బ్రదర్ చెప్పారు.

అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోవడానికి కారణం వివరించారు.‘‘పెళ్లికి ముందే నా భర్తతో ఈ విషయం గురించి చర్చ జరిగింది.‘పెళ్లయిన తర్వాత నువ్వు నటించకూడదు.
అది నీకు ఇష్టమేనా?’ అని అడిగారు.నేను కొంచెం వ్యవధి కావాలని అడిగా.
అయితే, ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడలేదు.ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆరోజు నాకసలు నిద్ర పట్టలేదు.
మా చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెబుతుండేది.‘ఆడపిల్ల అయినా, కాకపోయినా ప్రతి మనిషికి ఒక తోడూ-నీడా ఉండాలి’ అని.అది గుర్తుకు వచ్చి, నిర్ణయం తీసుకున్నా.ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ వెనకడుగు వేయను’’ అని తెలిపారు.







