కాపుల రిజర్వేషన్ అంశం గురించి తన వైకిరి ఏంటో కుండ బద్దలకొట్టినట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ తేల్చి చెప్పేయడంతో కాపు నాయకులు ఆలోచనలో పడ్డారు.మరీ ముఖ్యంగా జగన్ కు వెనక నుంచో ముందు నుంచో సపోర్ట్ చేస్తూ వచ్చిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైకిరి ఎలా ఉండబోతోందో అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.
వాస్తవంగా ఆయన చంద్రబాబు వ్యతిరేకం కాబట్టి, టీడీపీని ఓడించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు.ఇక ఇప్పుడు జగన్ కూడా కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రకటించడంతో జగన్ కి దూరం జరగాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది.

ప్రస్తుతం ముద్రగడ ముందు రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకటి జాతీయ పార్టీలను సమర్థించడం.అందులో కాంగ్రెస్, బీజేపీ లలో ఎవరికి మద్ధతు అన్నది తేలాల్సి ఉంది.రెండోది జనసేనకు జై కొట్టడం.తనకు, తన కుటుంబానికి అన్యాయం జరుగుతున్న సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉండి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ముద్రగడలో తీవ్ర ఆగ్రహం రగిల్చింది.అందుకే ఆయన జనసేన విషయంలో పెద్దగా సానుకూలత చూపించే అవకాశాలు కనిపించడంలేదు.
ఇక కాంగ్రెస్ విషయంలో ముద్రగడ కి కొంత సానుకూలత ఉంది.ఆపార్టీ కాపు రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తోంది.అదే సమయంలో కాంగ్రెస్ నేతలతో ముద్రగడకి మంచి సంబంధాలున్నాయి.త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్న హర్షకుమార్ వంటి వారితో ముద్రగడ నిత్యం ఉద్యమ కార్యాచరణపై చర్చలు జరుపుతూనే ఉన్నారు.
ఇక శైలజానాథ్, చింతా మోహన్ వంటి వారు ముద్రగడతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.దాంతో సోము వీర్రాజుతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ చివరకు కాంగ్రెస్ వైపు ముద్రగడ మొగ్గు చూపేందుకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయని అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ వైపు మళ్లినా, ఒంటరిగా మిగిలినా ముద్రగడ కారణంగా జగన్ కి మేలు కలుగుతుందని టీడీపీ చేసిన ఆరోపణలకు, తాజా పరిణామాలకు పొంతన కనిపించడం లేదు.దాంతో జగన్ కి ఈ వ్యవహారం నష్టం చేకూర్చడం ఖాయం.పవన్ ని ముద్రగడ సహాయంతో కార్నర్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ జగన్ దానిని చేజార్చుకున్నారు.ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలోనే జగన్ కాపు రిజర్వేషన్ల మీద చేసిన ప్రకటనతో ముద్రగడ మద్ధతు దూరం చేసుకున్నారు.







