తన మాటల తూటాలతో ఎంత పెద్ద నాయకుడినైనా డిఫన్స్ లో పడేలా తగిన ఆధారాలతో సహా విమర్శలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే.తెలంగాణా రాజకీయాల్లో ఆయనకు మొదటి నుంచి మంచి మంచి క్రేజ్ ఉంది.
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక మంచి హుషారు గా కన్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఇమేజ్ ను పెంచుకున్నారు.
ఆ తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు.

అయితే రేవంత్ పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది.తనకు పార్టీలో గౌరవమైన పదవి ఇస్తానని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినా ఇంత వరకూ అమలు కాకపోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమని రేవంత్ బలంగా నమ్మారు.దీంతో పాటు రేవంత్ చేసిన కామెంట్లపై కూడా సీనియర్లు సీరియస్ అయ్యారు.
ఆ తరువాత రేవంత్ తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు బయటకి లీకులు ఇవ్వడంతో సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.రేవంత్ కు ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామన్నారు.
తర్వాత ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగిస్తామన్నారు.కానీ ఆయనకు ఇప్పటివరకు ఏ పదవి దక్కకపోవడంతో దాని వెనుక కాంగ్రెస్ సీనియర్ల హస్తం ఉందని నమ్మడంతో ఆయన పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు.

తనకు పదవి దక్కకపోవడానికి ఉత్తమ్ కారణమని భావించిన రేవంత్ రెడ్డి ఉత్తమ్ వ్యతిరేకవర్గంతో కలసి ఢిల్లీ వెళ్లడం అప్పట్లో సంచలనం కల్గించింది.ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం.పదవి రాకపోవడానికి తాను కారణం కాదని, త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా ఉత్తమ్ రేవంత్ కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.అంతేకాదు రేవంత్ వెంట పార్టీలో చేరిన వారికి టిక్కెట్ల విషయంలో తన జోక్యం ఉండదని కూడా ఉత్తమ్ భరోసా ఇవ్వడంతో రేవంత్ మెత్తబడినట్టు సమాచారం.
ఎన్నికలు సమయం దగ్గరకు వస్తుండడంతో సొంత పార్టీ నాయకులతోనే గొడవలు పెట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుందని రేవంత్ ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు తప్పు సరిదిద్దుకున్నాడు.







