”మాది చాలా పేద కుటుంబం.దానికి తోడు వారు ఎప్పుడూ ఆందోళన పడేవారు.
అది కూడా నా గురించే.నాకు వయస్సు వచ్చాక అందరూ నన్ను చూసి త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవమని చెప్పారు.
ఎందుకంటే నేను నాలా పొట్టిగా, కొద్దిగా నల్లగా ఉంటాను.అందుకే వారు అలా చెప్పేవారు.
నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసే వారు.ఎవరైనా యువకుడు నన్ను పెళ్లి చూపులు చూసేందుకు వస్తే నేను ముఖం తెల్లగా ఉండాలని పౌడర్ వేసుకునే దాన్ని.
ఎత్తుగా కనిపించాలని హై హీల్స్ వేసుకునేదాన్ని.వాటిని వేసుకుంటే నాకు నడక వచ్చేది కాదు.
దీంతో పెళ్లి చూపులకు వచ్చే వారికి నాపై అనుమానం కలిగేది.నేను సరిగ్గా నడవగలనా, నా కాళ్లు బాగానే ఉన్నాయా, అని వారు చెక్ చేసుకునే వారు.

నా జుట్టు, శరీరం అంతా సక్రమంగా ఉందా, లేదా అని పరిశీలించేవారు.అయినా నాకు పెద్దగా బాధ అనిపించేది కాదు.అలా ఉండగా ఓ యువకుడు నన్ను పెళ్లి చూపుల చూసేందుకు వచ్చాడు.ఇది కూడా చెడిపోతుందని అనుకుంటూనే అతన్ని చూసేందుకు వెళ్లా.తీరా అతన్ని చూశాక అతను నాకు కరెక్ట్ కాదని అనిపించింది.ఎందుకంటే అతను తెల్లగా, ఎత్తుగా ఉన్నాడు.
అతని దగ్గరకు వెళ్లబుద్ధి కాలేదు.కుటుంబ సభ్యులు బలవంతం చేయడంతో అతనితో ఒంటరిగా మాట్లాడేందుకు వెళ్లా
ఇద్దరం కూర్చున్నాం.
అతను నా కాలి చెప్పులను చూశాడు.యథావిధిగా అవి ఎత్తు మడమల చెప్పులు.
వాటిని చూసి అతను అడిగాడు, ఆ చెప్పులు వేసుకుని నువ్వు ఎలా నడుస్తున్నావని అతను అన్నాడు.నేను నవ్వేశా.
ఎందుకో అతను మనస్ఫూర్తిగా ఆ ప్రశ్న వేశాడనిపించింది.కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం నెలకొంది.
తరువాత నేనే అడిగా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలని.అతను అన్నాడు, నీలా అందంగా నవ్వే అమ్మాయి అయితే చాలని.
వెంటనే ఆశ్చర్యపోయా.అంతే.
ఆ తరువాత మరి ఆలోచించలేదు.ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.
ఇప్పుడు మా పెళ్లయి 6 నెలలు కావస్తోంది.మేం చాలా హ్యాపీగా ఉన్నాం.
ఇప్పటి వరకు ఐ లవ్ యూ అనే మాట కూడా చెప్పుకోలేదు.అయినా ఇద్దరికీ తెలుసు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉందని, ఇద్దరం ఒకర్నొకరం ఇష్ట పడుతున్నామని.
అందుకేనేమో, ఇద్దరం కలసి నడుస్తూ వెళ్తుంటే.ఎంత సమయమైనా తెలియదు.
రోజూ అలా ఇద్దరం పని చేసి ఆఫీసుల నుంచి నడుచుకుంటూ వస్తుంటే.అదో మధురానుభూతి.! చెప్పలేని ఆనందం, హాయి.! ఇదిలాగే ఉండాలి.”
.