రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికి రాదు .అలా ఉంటే రాజకీయాల్లో రాణించలేరు.
కానీ ఇది అందరి విషయంలోనూ కాదు అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి లాంటి వారికి ఇలాంటివాటి నుంచి మినహాయిపు ఇవ్వాల్సిందే.ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ముక్కుసూటితనంగానే ముందుకు వెళ్తున్నారు.
తన నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డం, ఏది అనిపిస్తే అది చెయ్యడం జేసీ స్టయిల్.సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనే బేధం ఉండదు ఆయనతో తేడా వస్తే ఎవరితో అయినా ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంటుంది జేసీ వ్యవహారం.
గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆయన అనంతపురం నుంచి ఎంపీగా గెలుపొందారు.అయితే కొద్ది రోజులుగా జేసీ టీడీపీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగంగానే ఇష్టమొచ్చినట్టు పార్టీని, నాయకులను, ఆఖరికి అధినేత బాబు ని సైతం వదలకుండా విమర్శలు చేయడం జేసీకి చెల్లింది.కొట్టినట్లు మాట్లాడే ఆయన వ్యవహార శైలితో పార్టీ అధినేత చంద్రబాబుకే ఎన్నోసార్లు ఇక్కట్లు తప్పలేదు.
అది ఆయన మేనరిజం అనుకుంటూ వదిలెయ్యడం తప్ప గత్యంతరం ఉండదు ఎవ్వరికైనా.అనంత జిల్లాలో జేసీ బ్రదర్స్‌కున్న పట్టు వల్ల కూడా ఆయన ఎంత చెలరేగినా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు టీడీపీ అధిష్టానం.
ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు పోరాటానికి దిగితే… ఆ విషయంలో సైతం జేసీ తేలిక మాటలు మాట్లాడి.చంద్రబాబును కార్నర్ చేశారు.‘దీంతో ఒరిగేదేమీ లేదు.పార్టీ విప్ జారీ చేసినా పార్లమెంటుకు వెళ్ళేది లేదు’ అంటూ తెగేసి చెప్పిన జేసీ.
తర్వాత మధ్యవర్తుల బుజ్జగింపులతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు.అవిశ్వాసం ఓటింగ్ లో ఇష్టం లేకుండానే పాల్గొన్నారు.
మరుసటిరోజు ఏపీ భవన్లో చంద్రబాబు నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీలో కూడా ఆయన అసౌకర్యంగానే కనిపించారు.ఇటీవల ఒక మీడియా సమావేశంలో విలేఖరిని పట్టుకుని కెమెరాల ముందే బూతులు తిట్టేసి.
వార్తల్లోకెక్కారు.
ప్రస్తుతం అందరిలోనూ జేసి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడిన జేసీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులొచ్చాయని, ఈ వాతావరణంలో తాను ఇమడలేక పోతున్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది.ఇటువంటి రాజకీయాల నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తప్పుకుంటానని కూడా అన్నారాయన.
అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడడంలేదని ఇక రాజకీయాలకు దూరం కాబోతున్నారు అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి.