ప్రముఖ విలక్షణ సినీనటుడు పోసాని కృష్ణమురళీ కొద్ది రోజులుగా ఏపీలో అధికార టీడీపీ ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు.చంద్రబాబు మీద పోసాని పగబట్టినట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయన కుమారుడు కేటీఆర్‌ను అటు చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి అయిన లోకేశ్‌ను పోలుస్తూ బాబు అండ్ లోకేశ్‌ను ఓ ఆటాడుకుంటున్నాడు.తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ కొందరు సినీ పరిశ్రమ పెద్దలు చంద్రబాబును కలిసి తమ మద్దతు ప్రకటించడంపై పోసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అశ్వనీదత్, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌రావు, కిరణ్ తదితరులు చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటన చేసిన వార్తలపై ఆయన ఫైర్ అయ్యారు.వీరంతా సినిమా పరిశ్రమలో ఎవరిని సంప్రదించి ఈ మద్దతు ఇచ్చారో వివరణ ఇవ్వాలని పోసాని డిమాండ్ చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు.సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని కూడా పోసాని ఫైర్ అయ్యారు.
ఇక తాను ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దతు లేదని పోసాని కుండబద్దలు కొట్టేశారు.ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా చెప్పేసిన పోసాని పొలిటికల్ రూటు ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి.
పోసాని ఇప్పటికే తాను వైసీపీకి సపోర్ట్ చేస్తానని, ఆ పార్టీ అధినేత జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పేశారు.ఇక వచ్చే ఎన్నికల్లో పోసాని మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అంటే వైసీపీ వర్గాల్లో అవునన్న చర్చలే నడుస్తున్నాయి.
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పోసాని తన సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు.ఇక వచ్చే ఎన్నికల్లో పోసాని మళ్లీ అదే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేయవచ్చని తెలుస్తోంది.
అయితే పోసాని సొంత నియోజకవర్గం పొన్నూరు.అక్కడ గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పోటీకి రెడీ అవుతున్నారు.
అదే చిలకలూరిపేటలో రెండుసార్లుగా ప్రత్తిపాటి చేతిలో ఓడుతోన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అనారోగ్య కారణాలతో అంతగా యాక్టివ్ కాలేకపోతున్నారు.ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ క్యాండెట్‌ను మార్చవచ్చన్న టాక్ ఉంది.
అయితే రాజశేఖర్‌కు నామినేటెడ్ పదవి ఇస్తే ఆ ప్లేస్‌ను పోసానితో రీ ప్లేస్ చేయవచ్చంటున్నారు.పోసాని లాంటి గట్టి ఎటాక్ ఇచ్చే వాళ్లు తన పార్టీకి ఎంతో ప్లస్ అని జగన్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.







