జనసేన ప్రస్థానం మొత్తానికి మొదలైంది.ఇలా మొదలైందో లేదో అలా రెండు బహిరంగ సభలు పెట్టేసారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఇచ్చిన ప్రసంగాలు ఎంతవరకు ప్రజల్ని చైతన్యవంతం చేసాయో, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ పై జనసేన కార్యచరణ ఎంతవరకు ప్రజలకు అర్థం అయ్యిందో కాని, రాజకీయవేత్తలు మాత్రం ఇప్పటికి పవన్ ప్రసంగాల్లో విషయం లేదని చెబుతున్నారు.
అవన్ని పక్కనపెడితే, మొన్నటికిమొన్న జనసేన కార్యకర్త వినోద్ రాయల్ హత్య జరిగింది.
ఆ సంఘటన మరచిపోక ముందే, నిన్న జరిగిన కాకినాడ సభలో జరిగిన తొక్కిసలాట మరో ఇద్దరు అభిమానుల ప్రాణాల్ని తీసుకుంది.మృతుల్లో ఒకరైన వెంకటరమణ (22) కుటుంబాన్ని పరామర్శించడానికి కుయ్యూరు బయలుదేరుతున్నారు పవన్.
చనిపోయిన అభిమాని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటించారు పవన్.అంతే కాదు, ఇకపై ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయనని చెప్పుకొచ్చారు.
ఇదీలా ఉంటే సోషల్ మీడియాలో పవన్ పై అధికశాతం నెగెటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి.ఇప్పటికే చెప్పింది మళ్ళీ చెప్పడానికి ఈ సభలు పెట్టడం ఎందుకు, ఇలా అభిమానుల ప్రాణాలు తీయడం ఎందుకు, అని ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
అలాగే, ఇకపై ఇలాంటి సభలు పెట్టను అని పవన్ చెప్పడంతో కొంత శాంతించారు నెటిజన్స్.ఇప్పటికైనా పవన్ కి బుద్ధి వస్తే చాలని తెగ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.







