కోట్ల రూపాయల ఆస్తి ఉండి, విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఆయనది.అయితే వాటన్నింటినీ వదిలేశాడు.
దేశరాజధాని ఢిల్లీకి వచ్చి ఎంతో మంది పేదల కడుపు నింపుతున్నాడు.అప్పుడప్పుడు చేసే అన్నదానం కాకుండా రోజూ 250 మందికి పైగా పేదల కడుపు నింపుతున్నాడు.
పెట్టే ఆహారం కూడా పూర్తిగా పోషకాలతో కూడుకున్నది.ఇలా ఇన్ని చేస్తున్నా ఆ దానకర్ణుడికి కేన్సర్.73 ఏళ్ల వయసులో ఓ వైపు వయోభారం, మరో వైపు జీవితాన్ని కబళించే క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూనే పేదలకు నిరంతరం ఆహారం అందిస్తున్నాడు.ఇలా పేదల కడుపు నింపి, వారి సంతోషంలోనే తన ఆనందాన్ని చూసుకుంటున్న ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
దేశరాజధాని ఢిల్లీకి చెందిన నటరాజన్ (73) బాగా సంపన్నుడు.దాదాపు 30 ఏళ్ల పాటు లండన్‌లో నివాసమున్న ఆయన ఎంతో డబ్బు సంపాదించారు.ఎన్ని ఆస్తులు సంపాదించినా పేదలకు సేవ చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని ఆయన గ్రహించారు.వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చేశారు.
దక్షిణ ఢిల్లీలోని ధనవంతులు నివసించే పంచశీల్ ప్రాంతంలో తన సేవా కార్యక్రమాలను ఆయన రోజూ ప్రారంభించారు.అక్కడికి పనుల నిమిత్తం వచ్చే పేదలు, కూలీల కోసం తొలుత స్వచ్ఛమైన నీటిని అందించే వారు.
తర్వాత రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రారంభించారు.

మట్కామ్యాన్ అని స్థానికులంతా పిలుచుకునే ఆయనకు క్యాన్సర్.ఎంత కాలం బ్రతుకుతాడో కూడా తెలియని పరిస్థితుల్లో రోజూ 250 మందికి కడుపు నింపుతున్నాడు.ఆయన చేసే ఈ సేవా కార్యక్రమాలకు తన భార్య సహకారం కూడా తీసుకుంటున్నాడు.
రోజూ మధ్యాహ్నం 5 స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆహారం పెడుతుంటాడు.ఆహారంతో పాటు ఫ్రూట్లు, లస్సీ, జ్యూసులు అందిస్తున్నాడు.
అతని గురించి తెలుసుకున్న వారెవరైనా మట్కామ్యాన్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.