కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో భాగంగా 50మంది గాయాలపాలయ్యారు.ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది.
ఈ ఏడాది నిర్వహించిన కర్రల సమరంలో 50మంది భక్తులు గాయాలపాలయ్యారు.అంతేకాకుండా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.అస్వస్థతకు గురై మృతి చెందిన బాలుడిని రవీంద్రనాథ్ రెడ్డిగా గుర్తించారు.
గుండెపోటుతో మృతి చెందినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.అతని స్వస్థలం కర్ణాటకలోని శిరుగుప్పగా గుర్తించామని వెల్లడించారు.
జిల్లాలోని దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది.దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది.
దసరా బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.