ఇదేం దారుణం...?

యాదాద్రి జిల్లా: మహిళా దినోత్సవం నాడు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ,ఆత్మకూర్ (ఎం),చౌటుప్పల్ మండలాలకు చెందిన మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను మహిళా దినోత్సవం రోజున పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి,పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకుండానే మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మహిళా బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటూ ఊరువాడా సంబురాలు జరుపుతుంటే,ఇక్కడ పోలీసులు మాత్రం దినోత్సవం నాడు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్టు చేయడంతో ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని వలిగొండ జెడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా అన్నారు.

ఏలాంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వకున్నా ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని,ఈ రాష్ట్రంలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమని అన్నారు.ఈ విధమైన ముందస్తు అరెస్టు చేస్తే ఆనాడు తెలంగాణ వచ్చేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అరెస్ట్ అయిన మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌లు దంతురి సుమలత,పంజాల నాగమణి మాట్లాడుతూ ఇలా చీటికీమాటికీ అరెస్టులు చేయడం ఉదయమే 6 గంటలకు ఇంటి వద్దకు పోలీసులు వచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు అంటున్నారు.మహిళల పట్ల గౌరవం లేకుండా ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు.

Advertisement

తాము 14 సంవత్సరాలు ఉద్యోగం చేయడమే చేసిన తప్పా అని ప్రశ్నించారు.లేదంటే తెలంగాణ గురించి 42 రోజుల సకల జనుల సమ్మెలో పాల్గొని 42 రోజుల జీతం పోగొట్టుకోవడం చేసిన తప్పా అని నిలదీశారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మా ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ అరెస్టులను ఆపాలని,వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధులకు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తండ శ్రీశైలం గౌడ్, ముద్దసాని సిద్ధులు గౌడ్,పల్లెర్ల ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు ఏనుతల నగేష్,మండల ఫీల్డ్ అసిస్టెంట్లు కొంపల్లి ఇస్తారి,ఎర్ర నర్సిరెడ్డి,గుర్రం సురేష్,బూసి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు