రోజు గడుస్తున్న కొద్దీ వైసీపీని వీడి టిడిపిలో చేరాలనుకుంటున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతోంది.ఓ పక్కన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ప్రముఖులను రంగంలోకి దించిన జగన్ స్కెచ్ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది.
కనీసం వారితో సంప్రదింపులు కూడా లేవని తెగేసి చెప్పడంతో అవాక్కవ్వాల్సిన పరిస్థితి సదరు వైసీపీ నేతల వంతయ్యింది.దీంతో బొబ్బిలి నియోజకవర్గం వైసీపీ నుండి వీడిపోయినట్లే చెప్పవచ్చు.
అయితే ఇంతలోనే వైసీపీ నేతలు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వద్దకు చేరుకున్నారు.
వైసీపీని వీడవద్దని రాజన్న దొరతో చర్చలు జరపగా, తనకు ఆ ఉద్దేశం లేదని రాజన్న చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇలా ఎంతమందితో చర్చలు జరుపుతారు? ఎంతమందిని పార్టీని వీడకుండా నియత్రించగలుగుతారు? మీడియా వర్గాల్లో పేరు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే వద్దకు వెళ్లి చర్చలు జరిపితే… పార్టీ మారే ఉద్దేశం లేని వారికి నిజంగా అలాంటి ఆలోచనలను కలిగించినట్లే అవుతుంది కదా! అదీ గాక, నేడు చర్చలు జరిపిన నేతలు మరుసటి రోజో, ఆ మరుసటి రోజో జగన్ కు హ్యండ్ ఇస్తున్న వైనం విజ్ఞులకు విదితమే.ఇప్పటివరకు ఒక రాజకీయ ఆరోపణగా భావించిన ‘వైసీపీ మనుగడ’ మాటలు నిజమే అనిపించే విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.
దీంతో ఇక, జగన్ ‘కోట’కు నిజంగానే బీటలు వారినట్లేనని రాజకీయ వర్గాల్లో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.‘స్లో పాయిజన్’ మాదిరి పార్టీ నేతలు ఒక్కొక్కరిగా జగన్ ను వీడి వెళ్తున్న తీరు వైసీపీ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.