ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జంపింగ్‌లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది.అధికారంలోకి రావాలంటే బలమైన నాయకులు అవసరం.
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే అలాంటి నేతలు పార్టీలో ఉండాలని టీడీపీ కోరుకుంటోంది.దీంతో వైసీపీని ఎలాగైనా దెబ్బ తీయాలని, జగన్ ఆత్మ స్థైర్యాన్ని క్రుంగదీసేలా చంద్రబాబు ఆపరేషన్ వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టారు.2019 ఎన్నికలకు ముందు టీడీపీపై ఆరోపణలు చేసి వైసీపీకి దగ్గరైన మంచు మోహన్‌బాబు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై అందరికీ షాక్ ఇచ్చారు.మున్ముందు కూడా ఇలాంటి షాకులను చాలా చూడాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు కొన్ని జిల్లాలను ఎంచుకుని ఆయా జిల్లాలలో వైసీపీ అసంతృప్తులకు గేలం వేసి టీడీపీలోకి లాగేయాలని చంద్రబాబు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే తొలుత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని టీడీపీలో చేర్చుకోవడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆమె కూడా ఇటీవల వైసీపీ మీద పూర్తి అసంతృప్తితో కనిపిస్తున్నారు.తనను పట్టించుకోవడంలేదని, ఏ రకమైన పదవులు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.అటు విశాఖ జిల్లాలో కూడా వైసీపీలోని పలువురు అసంతృప్త నేతలకు టీడీపీ నుంచి ఆహ్వానాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ జాబితాలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఒంగోలులో మానుగుంట మహిధర్‌రెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకుంటారని సమాచారం.నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి ఇటీవల వైసీపీపై గుస్సా అవుతున్నారు.దీంతో ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.రాయలసీమ విషయానికి వస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పలువురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో జంప్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చేరికలన్నీ వచ్చే ఆరు నెలల కాలంలో జరుగుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.