ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.టీచర్లను ఉద్దేశించి బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవో వివాదాస్పదంగా మారింది.దీనిపై టీచర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
నూతన విద్యా సంవత్సం ప్రారంభంతోనే స్కూళ్లను విలీనం చేయడంతో ఉపాధ్యాయుల్లో అసహనం పెరిగిపోయింది.ఈ విలీనం వల్ల చాలా పాఠశాలలు కనుమరుగయ్యాయి.
అయితే టీచర్లు ప్రభుత్వంపైనే విమర్శలు చేయడాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స తట్టుకోలేకపోయారు.దీంతో టీచర్లకు సూటి ప్రశ్న వేశారు.ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ నిలదీశారు.బొత్స వేసిన ఈ ప్రశ్నకు ఉపాధ్యాయ సంఘాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.
మరి మంత్రి బొత్స, సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.బొత్స గురివింద గింజ మాదిరి మాట్లాడటం సరికాదని హితవు పలుకున్నారు.
తామేమీ హామీలు ఇచ్చి అధికారాలు అందలాలూ అందుకోలేదని ఈ దేశంలో పౌరులుగా తమకు ఉన్న హక్కులనే వాడుకుంటున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారని అనుకుంటే పొరపాటు అని.

కొందరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని గుర్తుచేస్తున్నారు.మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తూ ఏం సందేశం ఇస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలో చదువుకున్నా ఇబ్బంది లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి బొత్స తమను ఎలా ప్రశ్నిస్తారని టీచర్లు మండిపడుతున్నారు.కేవలం టీచర్లనే టార్గెట్ చేస్తూ మంత్రి విమర్శలు చేయడంలో సహేతుకత ఎంతవరకూ ఉందని నిలదీస్తున్నారు.
బడుగుల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది అన్నపుడు వారికి పాఠశాలల విలీనం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించాలని మంత్రికి హితవు పలుకుతున్నారు.మొత్తానికి బొత్స ఒక ప్రశ్న వేస్తే టీచర్లు 100 ప్రశ్నలు వేస్తున్నారు.
మరి వీటికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి.