ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఎవరి మీదైనా పంచ్ డైలాగులు వేయగల ముక్కు సూటి మనిషి మంచు మోహన్ బాబు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను సమర్థిస్తూ వస్తున్నారు.అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఎన్నికల ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్న మోహన్ బాబు కు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా హోదా దక్కుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.అంతే కాకుండా జగన్ కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య బంధుత్వం కూడా ఉండడంతో అందరూ ఇలానే భవిస్తూ వస్తున్నారు.
ఈ ప్రచారం ఇలా సౌతుండగానే అకస్మాత్తుగా ప్రధాని నరేంద్ర మోదీని మోహన్ బాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయనతో పాటు కూతురు మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, ప్రధానిని కలిశారు.సుమారు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా మోహన్ బాబు ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ మీరు బీజేపీ లో చేరితే బాగుంటుంది అంటూ వ్యాఖ్యానించిన్నట్టు తెలుస్తోంది.
దీంతో మోహన్ బాబు బీజేపీలో చేరడం దాదాపు ఫిక్స్ అయ్యిందనే హడావుడి మొదలవడంతో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు.తాను ప్రధానిని కలవడంలో ఏ రాజకీయం లేదని, కేవలం తిరుపతి లో ఉన్న తమ విద్యా సంస్థలను సందర్శించాలని మాత్రమే మోదీని కలిసి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అందుకే ఆయనతో పాటు అమిత్ షా ను కలిసినట్లు మోహన్ బాబు చెప్పారు.అయితే మోదీ అమిత్ షా లను తాను ఎందుకు కలిశాను అనే విషయాన్ని ఇప్పుడు మాత్రం చెప్పను, సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ఆయన సమాధానం దాటవేశారు.తాను వైసీపీ మద్దతుగా ఉంటానని, బీజేపీలో చేరానని విషయాన్ని ఆయన క్లారిటీగా చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబించడం చూస్తుంటే ఆయనకు బీజేపీ నుంచి ఏదైనా పదవిని ప్రధాని ఆఫర్ చేశారా ? అది వచ్చే వరకు ఇలా సైలెంట్ గా ఉంటూ సమయం చూసుకొని బిజెపిలో చేరుతారా అనేది తెలియాల్సి ఉంది.