రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది.ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరుతో… మాటల యుద్ధం కొనసాగుతోంది.
నేతల మధ్య వర్గపోరు టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ,తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.
ఇప్పటికే అనేకసార్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ల మధ్య పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా….మరోసారి ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఇటీవల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కొందరు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని….లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెల్లడించారు.ఇక కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అని భావించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ….
ఇండైరెక్ట్ గా నే కౌంటర్ ఇచ్చారు.దళిత బంధు విషయంలో కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఆ విధంగా మాట్లాడితే మంచిది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు పిండితే రావంటూనే మరోమారు కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో మళ్ళీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం…పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తుంది.పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.