అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.విదేశాంగ విధానంతో పాటు ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తాజాగా ఎంతో మంది వృత్తి నిపుణులకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ.తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చేలా సాయం చేస్తున్న హెచ్ 1 బీ వీసా( H-1B visa programme ) స్కీమ్‌పై రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అధ్యక్షుడినైతే హెచ్ 1 బీ వీసా విధానాన్ని ఎత్తేస్తానని పేర్కొన్నారు.ఈ వీసా ప్రోగ్రామ్‌ను ఆయన ‘‘దాస్యం’’గా అభివర్ణించారు.

అయితే వివేక్ రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించారు.2018 నుంచి 2023 వరకు హెచ్1బీ వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి వివేక్ మాజీ కంపెనీ రోవాంట్ సైన్సెస్ చేసిన 29 దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఆమోదించింది.అలాంటిది ఈ పథకాన్ని ఆయన చెడ్డదిగా అభివర్ణించడం కలకలం రేపుతోంది.లాటరీ విధానాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయాలని వివేక్ వ్యాఖ్యానించినట్లుగా పొలిట్‌కో నివేదించింది.అలాగే యూఎస్ గొలుసు ఆధారిత వలసలను తొలగించాల్సిన అవసరం వుందని వివేక్ పేర్కొన్నారు.కుటుంబ సభ్యులుగా వచ్చే వ్యక్తులు ఈ దేశానికి నైపుణ్య ఆధారిత సహకారాలు అందించే మెరిటోక్రాటిక్ వలసదారులు కాదన్నారు.

వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) ఫిబ్రవరి 2021లో రోవాంట్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు.అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించే వరకు ఆయన ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా కొనసాగారు.మార్చి 31 నాటికి ఈ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు 904 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులను కలిగివుంది.ఇందులో ఒక్క అమెరికాలోనే 825 మంది వున్నట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ఫైలింగ్స్ పేర్కొంది.
దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని.అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా వివేక్ పేర్కొన్నారు.