ఏపీలో అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి పెరుగుతున్నట్లు వినిపిస్తోంది.ప్రతి జిల్లాల్లోనూ ఎక్కడో ఒకచోటు గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
తాజాగా విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు పీక్స్ లో ఉందని వినిపిస్తోంది.
అయితే వ్యక్తుల మధ్య కాకుండా సామాజిక వర్గాల మధ్య పోరు నడుస్తోందిని రాజకీయ పండితులు అంటున్నారు.ఇక ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఇక వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అంటే అదే పార్టీకి చెందిన బీసీ నేతలు మండిపడుతున్నారట.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలనే వాదన బలంగా వినిపిస్తున్నారు.
ఇటీవల ఏ కార్యక్రమం చేపట్టినా బీసీ నేతలంతా ఒకే నినాదం అందుకుంటున్నారు.వీరి వెనక పార్టీ నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరులు కావడంతో.సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తోంది.మంత్రి అండతోనే వ్యతిరేక గళం వినిపిస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న బొత్స అనుచరులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తదితరులు ఎమ్మెల్యే కోలగట్లకు మంటపుట్టే పనులు చేస్తున్నారట.కోలగట్ల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలతో సఖ్యతగా వ్యవహరించడం లేదని అంటున్నారు.
బీసీలకు సీటు కేటాయించాలని…
అయితే బీసీలు అత్యధికంగా ఉన్న విజయనగరం నియోజకవర్గంలో ఓసీ అభ్యర్థికి సీటెలా ఇస్తారని… బీసీ నేతలు వైసీపీని నిలదీస్తున్నారట.2024లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే విజయనగరంపై అధిష్టానం ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారట.గత ఎన్నికల్లో వీరభద్రస్వామి టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుపై దాదాపు 6400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.2004లోనూ కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్గా గెలుపొందారు.అలాగే 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.2014లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కోలగట్ల ఓడిపోయారు.

అయితే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి మరోమారు తానే పోటీ చేస్తానని తేల్చిచెబుతున్నారంట.తాను పోటీ చేయకపోతే తన కుమార్తె కోలగట్ల శ్రావణి పోటీ చేస్తుందని ఇప్పటికే అందరికీ చెప్పేసినట్లు సమాచారం.ఇటీవల ఒక పార్టీ కార్యక్రమంలో మంత్రి బొత్స సమక్షంలోనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోలగట్ల నిర్మొహమాటంగా చెప్పారని ప్రచారం జరుగుతోంది.బొత్స ముందే పరోక్షంగా ఎమ్మెల్యే కోలగట్ల చెప్పడం చర్చకు దారితీస్తోంది.
అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు లేదా ఆయన కుమార్తె అదితి గజపతిరాజు అసెంబ్లీ బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.