తెలంగాణలో టిడిపి ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, సెటిలర్లు అధికంగా ఉండే ప్రాంతాలపైన టిడిపి ఫోకస్ పెట్టింది.
తమ బలాన్ని నిరూపించుకోవడం ద్వారా తెలంగాణలో బిజెపికి దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.ఈ పొత్తు కనుక కుదిరితే ఆ చనువుతో ఏపీలోనూ బిజెపితో పొత్తు పెట్టుకుని రాజకీయంగా తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే లక్ష్యంతో తెలంగాణలో టిడిపిని చంద్రబాబు యాక్టివ్ చేశారు.
ఇక బిజెపి కూడా టిడిపి విషయంలో సానుకూలంగా ఉందని బి ఆర్ ఎస్ ను అధికారంలోకి రాకుండా చేసేందుకు టిడిపి తో పొత్తు కు సిద్ధమైందని నిన్నటి వరకు ప్రచారం జరిగింది.ఈ మేరకు తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రస్తావించారని , తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టిడిపి తో కలిసి వెళ్ళబోతున్నామని, అలాగే షర్మిల పార్టీని కూడా కలుపుకు వెళ్తామంటూ తరుణ్ ఛుగ్ చెప్పినట్లుగా ఓవర్గం మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

అసలు మీడియా ప్రతినిధులతో తాను ఈ చర్చే తీసుకురాలేదని, తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ సెక్షన్ మీడియాలో వచ్చిన కథనాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తరుణ్ చుగ్ ప్రకటించారు.ఈ కథనం పూర్తిగా అవాస్తవమని , పార్టీకి దురుద్దేశాలు ఆపాదించే లక్ష్యంతో ఈ కథనాన్ని సృష్టించినట్లు అర్థమవుతుందని, తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీలు బిజెపి పై అసత్య ప్రచారాలు చేస్తూ … పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాయి అంటూ టిడిపిని ఉద్దేశించి తరుణ్ చుగ్ మండిపడ్డారు.

తెలంగాణలో ఒంటరిగా బీఆర్ ఎస్ ను ఓడించే అంత బలం బిజెపికి ఉందని , బిజెపి నే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నానని తరుణ్ తెలిపారు.బిజెపి ,టిడిపి పొత్తు విషయంలో వస్తున్న కథనాలు , ప్రచారాలను తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి హోదాలో తాను ఖండిస్తున్నానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో బిజెపి ,టిడిపి పొత్తు కుదిరింది అంటూ నిన్నటి వరకు జరిగిన హడావుడి అంతా వట్టిదే అనే విషయం అర్ధం అవుతోంది.
తెలంగాణలో వచ్చిన క్లారిటీతో ఏపీలో నూ ఆ ఆశలను చంద్రబాబు వదులుకోవాల్సిందే .!







