దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.వడ్ల కొనుగోళ్ల అంశంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది.
తాజాగా ఈ ఫైట్ ఢిల్లీకి చేరింది.నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు పిలుపునిచ్చారు.
దీంతో బీజేపీ కూడా రంగంలోకి దిగింది.టీఆర్ఎస్తో పోటాపోటీగా బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ భవన్ వద్ద బండి సంజయ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.గల్లీ రాజకీయాలు ఢిల్లీలో చేస్తావా అంటూ సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలో రాశారు.
మరోవైపు దీక్ష పేరుతో టీఆర్ఎస్ కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసింది.దీంతో ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద రోడ్లన్నీ టీఆర్ఎస్, బీజేపీ నేతల ఫ్లెక్సీలతో నిండిపోయాయి.
అయితే బీజేపీ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీఆర్ఎస్ నేతల పనేనని ఆరోపిస్తున్నారు.టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శిస్తున్నారు.
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఉద్యమిస్తున్నారు.కేంద్రం మరింత ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది.

తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస తొలిసారి సమరశంఖం పూరించనుంది.ఢిల్లీ తెలంగాణభవన్‌లో ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో దీన్ని నిర్వహించనుంది.
దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి, మండల పరిషత్, పురపాలక సంఘాల అధ్యక్షులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్రకార్యవర్గ ప్రతినిధులు పాల్గొంటారు.దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.
దీక్ష మధ్యాహ్నం వరకూ కొనసాగించాలని నిర్ణయించారు.సీఎం కేసీఆర్ తన నివాసంలో ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్షించారు.







