హైదరాబాద్ లో ఈనెల 3వ తేదీన తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.గాంధీభవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కాగా ఈ భేటీకి కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు.
గత ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో 17 స్థానాలనూ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువత జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణతో పాటు ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.దీనిపై నివేదకను రూపొందించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4న ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు.