వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడుతూ వాచ్ మెన్ చేతిలో దొంగ దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా లోని కుషాయి గూడ లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం రంగయ్య అనే 60 సంవత్సరాల వ్యక్తి కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.
మంగళవారం అర్ధరాత్రి ఒక యువకుడు వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి చోరబడ్డాడు.గర్భ గుడిలోని హుండీని పగల గొట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఇంతలో వాచ్ మెన్ రంగయ్య కు శబ్దం వినిపించగా అక్కడికి వచ్చి అడ్డుకున్నాడు.

ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది.ఆ యువకుడు రాళ్లతో దాడి చేస్తుండగా, రంగయ్య అక్కడే ఉన్న ఒక కర్రతో దాడి చేశాడు.ఈ క్రమంలో జరిగిన గొడవలో కర్ర కాస్త బలంగా తలకు తగలడంతో ఆ యువకుడు రక్తపు మడుగులోకి జారుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.రంగయ్య కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు ఆ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, మొబైల్ ఫోన్ కనిపించింది.ఆ ఫోన్ లోని సమాచారాల ద్వారా కామారెడ్డి జిల్లా ఆరేపల్లి లో నివాసం ఉండే గడ్డం రాజు (23) గా పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆలయంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.







